తెలంగాణ

telangana

ETV Bharat / state

Terrorists in Hyderabad : రాష్ట్ర రాజధానిపై 'ఉగ్ర' నీడలు

Terrorists Movements in Hyderabad : శాంతియుత వాతావరణంతో ఉన్న హైదరాబాద్​ను ఉగ్రనీడలు కలవరపెడుతున్నాయి. పకడ్బందీ భద్రతా నిఘాలో కూడా ఉగ్రవాదులు యథేచ్ఛగా తిరగడం అధికారులకు కంటికి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఉగ్రవాదులంతా నగరంలో ఎక్కడ సమావేశాలు జరిపేవారు..? ఎలా కార్యకలాపాలు సాగేవి..? ఏ ప్రాంతాన్ని నెరువు చేసుకున్నారు..? అనే కోణంలో నిఘా సంస్థలు ఉగ్ర మూలాలపై ఆరా తీస్తున్నాయి.

terror attack cases in hyderabad
ఉగ్ర మూలాలపై ముమ్మరంగా దర్యాప్తు

By

Published : May 11, 2023, 11:35 AM IST

Terrorists Movements in Hyderabad : అంతర్జాతీయ వేదికపై గొప్ప కీర్తి, శాంతియుత వాతావరణానికి పెట్టింది పేరు, శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని ఉగ్ర ఛాయలు కలవరపెడుతున్నాయి. కిందటి సంవత్సరం దసరా పండగ రోజు నగరంలో మారణహోమం సృష్టించాలనుకున్న నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను ముందుగానే గుర్తించి కట్టడి చేశారు నిఘా అధికారులు. ఆ ఉగ్రవాదుల నుంచి చైనాలో తయారైన గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా హజ్బ్‌ ఉత్‌ తహరీర్‌(హెచ్‌యూటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. నగర టాస్క్ ఫోర్స్ సహాయంతో నిఘా సంస్థలు ముందుగానే ముప్పును పసిగట్టి ఆపగలిగాయి.

దృష్టంతా హైదరాబాద్‌ వైపే :హైదరాబాద్ మహా నగరంలో ఐదు లక్షల సీసీ కెమెరాలు, బందోబస్తు విధుల్లో తిరిగే పెట్రోలింగ్ వాహనాలు, నిఘా సంస్థలు...ఇవన్నీ నగరంలో భద్రతా నిమిత్తం ఉన్నప్పటికీ ఉగ్రవాదులు స్వేచ్ఛగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తుంది. దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా నిఘా వర్గాల దృష్టి అంతా హైదరాబాద్ వైపే ఉంటుంది. నగరంలో ఉగ్రవాద సంస్థల సానుభూతి పరులు, షెల్టర్ కోసం వచ్చిన వాళ్లు, స్లీపర్ సెల్స్ ఇలా ఎంతో మందిని దర్యాప్తు సంస్థలు ఇక్కడే అరెస్టు చేయడం ఇందుకు నిదర్శనం. 2017లో ముగ్గురు యువకులు ఐసిస్‌లో చేరడానికి నగరం నుంచి బయల్దేరి కాశ్మీర్‌ సరిహద్దులో దొరికిపోయారు. 2019లో మరికొంత మందిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్‌ చేసి వదిలేశారు. కర్ణాటకలో బాంబు పేలుళ్ల నిందితుడిని టోలిచౌకిలో అరెస్టు చేశారు.

గుట్టు చప్పుడు కాకుండా :తాజాగా అరెస్టయిన హెచ్‌యూటీ ఉగ్రవాదులు హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. ఇంటిని అద్దెకు ఇచ్చే సమయంలో ఉగ్రవాదుల వివరాలేమి ఇంటి యజమానులు అడిగి తెలుసుకోలేదు. వీరు భార్య, పిల్లలతో కలిసి ఇక్కడే జీవిస్తున్నారు. అయితే ఈ ఉగ్రవాదులు అద్దెకు ఉన్నప్పటికీ స్థానికులతో ఎలాంటి పరిచయాలు పెంచుకోకుండా, వారి పిల్లల్ని ఇంట్లో ఉంచే చదివించడం ద్వారా వీరి వివరాలేవి బయటపడకుండా జాగ్రత్త పడ్డారని పోలీసు అధికారి తెలిపారు. జగద్గిరిగుట్ట మక్దూమ్‌నగర్‌లో ఉన్న మహ్మద్‌ హమీద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు. అతడు ఉదయం 5 గంటలకు బయటకెళితే రాత్రి 9కి ఇంటికి వచ్చేవాడని స్థానికులు తెలిపారు. ఆ ముగ్గురు పిల్లల్ని తాము ఇంతవరకు చూడలేదని చెప్పారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అడవులు :హైదరాబాద్ నగరంలో నిఘా ఎక్కువ ఉండటం వల్ల అసాంఘిక శక్తులు జహీరాబాద్‌, వికారాబాద్ అటవీ ప్రాంతాలను అడ్డాగా చేసుకుంటున్నాయి. గతంలో సిమీ ఉగ్రవాదులు, వికారుద్దీన్ ముఠా వికారాబాద్ అడవుల్లోనే తీవ్రవాద శిక్షణ తీసుకున్నాయి. ప్రస్తుతం అరెస్టయిన ఆరుగురు ఉగ్రవాదులు కూడా వికారాబాద్ అడవులలోనే కొన్ని మీటింగ్స్ పెట్టుకున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. వీరు అక్కడే శిక్షణ తీసుకున్నారా అనే కోణంలో అధికారులు ఆరాతీస్తున్నారు.

ఉత్తరప్రదేశ్, బిహార్​ల నుంచి దేశీయ పిస్తోళ్లు నగరానికి చేరుతున్నాయి. వీటిని కొన్న కొందరు పాత నేరస్థులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తుపాకీ కాల్చడంతో తర్ఫీదు కోసం వికారాబాద్, మొయినాబాద్ ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లకు చేరుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ మధ్యకాలంలో గన్‌తో అరెస్టయిన ఇద్దరు ఇదే ప్రాంతానికి చెందిన వారు. రియల్‌ వ్యాపారులు, రౌడీషీటర్లు, గంజాయి స్మగ్లర్ల పంచాయితీలకు జహీరాబాద్‌ అనుకూల ప్రాంతంగా మారిందని ఓ పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేశారు. . ఇరు రాష్ట్రాలకు సరిహద్దున ఉండటం, అటవీ ప్రాంతం కావడంతో అసాంఘిక శక్తులు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వివరించారు. తాజాగా బయటపడిన ఉగ్రకోణంతో పోలీసు అధికారులు ఈ రెండు ప్రాంతాలపై దృష్టి సారించారు. అవసరమైన అన్ని చర్యలకు సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి:

TSPSC Paper Leak Case : పేపర్ లీకేజీ కేసులో సిట్​ దూకుడు.. రేణుకకు బెయిల్

Islamic radicals in Hyderabad : హిందువు నుంచి ఇస్లామిక్ రాడికల్స్​గా.. జిహాద్ సాహిత్యమే ప్రేరణ

ABOUT THE AUTHOR

...view details