హైదరాబాద్ నగరంలో విద్యుత్ నియంత్రికలు ప్రమాద ఘంటికలుగా మారాయి. నిత్యం జనంతో కిటకిటలాడే ప్రాంతాల్లోనూ వేలాడే విద్యుత్ తీగలు, ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్లు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. వర్షాకాలంలో సమస్య మరింత జటిలమై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగించే పరిస్థితి నెలకొంది. ఆడుకుంటూ రోడ్‌పై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో నిశాంత్ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కొడుకు పడుతున్న ఇబ్బందిని చూసి ఆ కన్నపేగు తల్లడిల్లుతోంది. మౌలాలీలోని ఈస్ట్ మారుతినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిశాంత్ తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోయాడు. అన్నీ తానై సాకే బిడ్డను కాపాడేందుకు ఆదుకోవాలని ఆ తల్లి వేడుకుంటోంది. గతంలో ఇలాంటి ప్రమాదాలు అనేకం జరిగాయి.. అయినా విద్యుత్ అధికారుల్లో చలనం లేదు.
70 నుంచి 80శాతం..
నగరంలో లక్షకు పైగా విద్యుత్తు నియంత్రికలున్నాయి. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఇళ్ల మధ్యనే ఉండే విద్యుత్ నియంత్రికలతో... ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. దాదాపు 70 నుంచి 80శాతం ట్రాన్స్‌ఫార్మర్లు కంచె లేకుండానే ఉన్నాయి. రోడ్ల పక్కన, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు, కూరగాయల మార్కెట్లు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు, ఇళ్ల మధ్యనే ఏర్పాటు చేసినా... కనీసం వాటి చుట్టూ కంచెలు కనిపించవు. అక్కడే చెత్తను పారేస్తుండటంతో వేసవిలో ఓవర్‌లోడ్‌తో నిప్పు రవ్వలు పడి అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరికొన్ని చోట్ల ట్రాన్స్‌ఫార్మర్‌లు చాలా కిందకు ఉన్నాయని, ముఖ్యంగా పార్కుల వద్ద కంచె లేని విద్యుత్ నియంత్రికలు భయపెడుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.