టెన్త్, జూనియర్ ఇంటర్ పరీక్షలు రద్దు.. సెకండియర్ ఎగ్జామ్స్ వాయిదా
18:35 April 15
టెన్త్, జూనియర్ ఇంటర్ పరీక్షలు రద్దు.. సెకండియర్ ఎగ్జామ్స్ వాయిదా
పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ నిర్ణయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వచ్చే నెల 17వ తేదీ నుంచి జరగాల్సిన పదోతరగతి పరీక్షలను రద్దు చేసింది. ఎస్సెస్సీ బోర్డు రూపొందించే ఆబ్జెక్టివ్ విధానం ఆధారంగా పదో తరగతి విద్యార్థుల ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. ఒకవేళ ఆ మార్కులపై ఎవరైనా విద్యార్థులు సంతృప్తి చెందకపోతే పరిస్థితులు మెరుగయ్యాక వారికి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు.
ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం... జూన్ నెల మొదటి వారంలో పరిస్థితులను సమీక్షిస్తామని తెలిపింది. కనీసం పక్షం రోజుల ముందు కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది. రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎవరికైనా బ్యాక్ లాగ్ సబ్జెక్టులు ఉంటే వారికి కనీస పాస్ మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది.
మొదటి సంవత్సరం విద్యార్థులందరనీ ఎలాంటి పరీక్షలు లేకుండానే రెండో ఏడాదికి ప్రమోట్ చేయనున్నట్లు తెలిపిన ప్రభుత్వం... పరిస్థితులు చక్కబడ్డాక వారికి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలో ఇంటర్మీడియట్ మార్కులకు 25శాతం వెయిటేజీ ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు.