కరోనా కట్టడికి అనుగుణంగా విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా అన్ని చర్యలూ తీసుకుంటామని, ఇద్దరు విద్యార్థుల మధ్య అయిదు నుంచి ఆరడుగుల దూరం ఉండేలా ప్రణాళికలు రూపొందించామని విద్యాశాఖ తెలిపింది. పదో తరగతిలో మిగిలిన పరీక్షలను నిర్వహించేందుకు హైకోర్టు నుంచి అనుమతి కోరిన విద్యాశాఖ.. అందుకోసం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలను న్యాయస్థానానికి సమర్పించిన ప్రమాణపత్రంలో పేర్కొంది.
- ఇంతకుముందు ఒక్కో పరీక్ష కేంద్రానికి 200-240 మంది విద్యార్థులు ఉండగా.. ఇప్పుడు 100-120 మందినే కేటాయిస్తాం.
- ఇద్దరు విద్యార్థుల మధ్య 5-6 అడుగుల భౌతిక దూరం పాటిస్తాం. గతంలో ఇది మూడడుగులే ఉండేది.
- కొత్తగా పెరిగిన 2005 కేంద్రాలకు వైద్య సిబ్బందిని నియమిస్తాం.
- సీటు వదిలి మరో సీటులో కూర్చొని బస్సుల్లో ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తాం. హాల్‌టికెట్‌ను పాస్‌గా పరిగణించి పరీక్ష కేంద్రానికి బస్సుల్లో రావొచ్చు.
- విద్యార్థితోపాటు పరీక్ష కేంద్రానికి ఒక సహాయకుడు మాత్రమే వచ్చేలా ఇద్దరినే అనుమతిస్తాం.
- పరీక్ష కేంద్రాల వద్ద అంతా తప్పక మాస్కులు, గ్లౌజులు ధరించేలా చూస్తాం.
- శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచుతాం.
- పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాం. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడే విద్యార్థులను ప్రత్యేక గదిలో పరీక్షలు రాయిస్తాం.
- పరీక్షకు ముందు, తర్వాత గదులను సోడియం హైపోక్లోరైట్‌తో శుద్ధిచేస్తాం.
- పరీక్షల నిర్వహణ సిబ్బందికి జ్వరం, దగ్గు, జలుబు ఉంటే అనుమతించం.