పదోతరగతి పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. సర్కార్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఆరోపించాయి. పదో తరగతి ప్రశ్న పత్రం బయటకు రావడం బయటకు రావడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కనిపిస్తోందని ఆయన విమర్శించారు.
తెలంగాణలో పరీక్షలు వస్తే.. లీకేజీల జాతర నడుస్తోంది: తెలంగాణలో పరీక్షలు వస్తే.. లీకేజీల జాతర నడుస్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం.. కొనసాగుతుండటం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. పదో తరగతి తెలుగు పేపర్ లీకేజీపై న్యాయ నిపుణులతో చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ కోరారు.
ఎస్‌ఎస్‌సీ బోర్డును ముట్టడించిన కాంగ్రెస్: హైదరాబాద్ నాంపల్లిలోని ఎస్‌ఎస్‌సీ బోర్డు ముందు ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. కార్యాలయం వద్ద బైఠాయించారు. ఈ క్రమంలోనే బోర్డును కోడిగుడ్లతో కొట్టి ధ్వసం చేశారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు.