Tension Situation in Jonnalagadda: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో నరసరావుపేట తెదేపా ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. గురువారం రాత్రి జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు మాయం చేశారు. దీంతో శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. విగ్రహాన్ని మాయం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వైకాపా నాయకుల ఫిర్యాదు మేరకు జొన్నలగడ్డ గ్రామానికి చెందిన తెదేపా నేతలు అనిల్, రాజేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో విచారించకుండా ఎక్కడికో తీసుకెళ్లి విచారిస్తున్నారని తెదేపా నాయకులు జొన్నలగడ్డలో ఆందోళనకు దిగారు.
అరవిందబాబుకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
TDP Leader Chadalavada Aravinda Babu: తెదేపా శ్రేణులు గుంటూరు- కర్నూలు రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నరసరావుపేట గ్రామీణ పోలీసులు రంగంలోకి దిగి ధర్నా విరమించాలని తెదేపా నాయకులను కోరారు. వారు పట్టించుకోకపోవడంతో పోలీసులు బలవంతంగా తెదేపా నాయకులను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను చెదరగొట్టి అరవిందబాబును బలవంతంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. తోపులాట జరగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. పార్టీ శ్రేణులు వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఏం చేస్తున్నారు ..?
తెదేపా నరసరావుపేట ఇంఛార్జ్ అరవింద్ బాబుపై దాడిని ఖండిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్ట్‌లపై నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేస్తారా..? అని ప్రశ్నించారు. తెదేపా శ్రేణులపై వైకాపా దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అస్వస్థతకు గురైన తెదేపా నేతలను తరలించే అంబులెన్స్ పైనా దాడికి దిగడం వైకాపా అరాచకానికి, పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఘర్షణకు కారణమైన వైకాపా కార్యకర్తలతో పాటు పోలీసులపైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
చర్యలు తీసుకోవాలి
పండుగపూట కూడా రాష్ట్రంలో అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తెదేపా నేతల అక్రమ అరెస్టులను ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవింద్‍బాబుపై పోలీసులు, వైకాపా నేతల దౌర్జన్యం చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. దాడికి పాల్పడిన వైకాపా శ్రేణులు, అందుకు సహకరించిన పోలీసులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.