Chandrababu Kuppam Tour: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కుప్పం నియోజకవర్గం పర్యటన ఉద్రిక్తంగా మారింది. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల పర్యటనకు విచ్చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పోలీసు నిర్బంధాలు, అడ్డంకులను ఛేదించుకొని తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులోని శాంతిపురం మండలం జేపీ కొత్తూరు వద్ద అధినేతకు ఘనంగా స్వాగతించారు.
CBN Kuppam Tour Updates: వారిని చూసి వాహనం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తెదేపా శ్రేణులు భారీగా తరలిరావడంతో పెద్దూరు రహదారి జనసంద్రంగా మారింది. మరో వైపు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని నోటీసు ఇచ్చేందుకు పెద్దూరులో పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు జేపీ కొత్తూరు నుంచి భారీ ర్యాలీగా తరలిరావడం, పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడంతో ఏపీ - కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది.
Tension in Chandrababu Kuppam Tour: చంద్రబాబు పర్యటనకు ఎలాంటి అనుమతులు లేవని కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ లెక్కచేయకుండా టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. క్రేన్ సాయంతో చంద్రబాబుకు గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. అప్పటికే చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసిన పోలీసులు.. పెద్దూరులో తెదేపా నేతలు ఏర్పాటు చేసిన మైకులు తొలగించారు.
Chandrababu fire on Kuppam police: పోలీసుల తీరుపై చంద్రబాబు ఫైర్..భారీ ర్యాలీతో పెద్దూరు చేరుకున్న చంద్రబాబుకు పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, స్థానిక సీఐ నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించారు. రోడ్ షో, ర్యాలీలకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. డీఎస్పీ నుంచి నోటీసు తీసుకునేందుకు నిరాకరించిన చంద్రబాబు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. ఎందుకు నోటీసు ఇస్తున్నారో రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వాహనం నుంచి కిందకు దిగి పాదయాత్రకు సిద్ధమయ్యారు. పోలీసు 30 యాక్టు ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
CBN Comments on Jagan సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు ఆంక్షలు విధిస్తారా అని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పం పర్యటనకు అనుమతి లేదని డీఎస్పీ మౌఖికంగా చెప్పి వెళ్లిపోయారు. ఉదయం నుంచి చోటు చేసుకున్న ఘటనలతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెదేపా కార్యకర్తలు పెద్దూరు వద్ద పోలీసుల తీరుతో మరోసారి తీవ్ర అసహనానికి గురయ్యారు. పలమనేరు డీఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది పోలీసులు చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా తెదేపా శ్రేణులు నినాదాలు చేశారు. తదుపరి కార్యాచరణపై స్థానిక నేతలతో చంద్రబాబు చర్చించారు.
Nara lokesh fire on JAGAN: చంద్రబాబు కుప్పం పర్యటన అడ్డగింతపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏమైనా జగన్ జాగీరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏమైనా ఎమర్జెన్సీ విధించారా? అని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనకు మీ ఆంక్షలు ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: