Congress Protest GHMC Office : కాంగ్రెస్ పార్టీ నేడు చేపట్టిన జీహెచ్ఎంసీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం.. ఉద్రిక్తతకు దారి తీసింది. గడిచిన ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఎడతెరపి లేని వర్షాలతో ఉపాధి కోల్పోయిన కార్మికులను, ఇళ్లలోకి నీళ్లు వచ్చి వీధిన పడ్డ కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని హస్తం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు నేడు జీహెచ్ఎంసీ కార్యాలయం ముట్టడికి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే గన్‌పార్క్ నుంచి కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్, కోదండరెడ్డి తదితరులు జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కార్యాలయం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Congress Protests to support Flood Victims :వర్షాలతో కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వరద బాధితులకు రూ.10,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కాంగ్రెస్ నేతలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో పలువురు నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విజయారెడ్డి, పలువురు పార్టీ శ్రేణులు జీహెచ్‌ఎంసీ కార్యాలయ మెయిన్ గేటు ఎక్కేందుకు యత్నించగా.. అధికారులకు వినతి పత్రం అందించేందుకు పలువురు ముఖ్య నేతలను పోలీసులు లోపలికి అనుమతించారు. అయితే.. కాంగ్రెస్ నేతల వినతిపత్రాన్ని తీసుకునేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ నిరాకరించారు.
Congress Dharna GHMC Office :జీహెచ్‌ఎంసీకమిషనర్ రోనాల్డ్ రోస్ తీరుపై కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తాము వినతిపత్రం అందించేందుకు వెళ్లగా.. తీసుకునేందుకు ఆయన నిరాకరించారని ఆరోపించారు. దీంతో కమిషనర్ పేషీ ముందు నేతలు మల్లు రవి, హనుమంతరావు, కోదండరెడ్డి తదితరులు ఆందోళనకు దిగారు. హనుమంతరావు అక్కడే పేషీ వద్ద పడుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న నాయకులను బయటకు పంపేందుకు యత్నించారు. ఇంతలో మల్లు రవి.. కమిషనర్ రోనాల్డ్ రోస్‌తో మాట్లాడి వినతిపత్రం తీసుకునేందుకు ఒప్పించారు. దీంతో పరిస్థితులు సద్దుమణిగాయి.