తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Jung Siren: ఉద్రిక్తంగా కాంగ్రెస్ జంగ్ సైరన్... నేడు నిరసనలకు పీసీసీ పిలుపు - Congress Jung Siren

కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగ యువత, విద్యార్థి సమస్యలపై జంగ్‌ సైరన్‌ (Congress Jung Siren)) పేరుతో చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. లాఠీఛార్జీలు, తోపులాటలు, అరెస్టులతో దద్దరిల్లింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ఇంటి వద్దనే అడ్డుకున్న పోలీసులు... దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ వద్ద వందలాది మంది మోహరించి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

Congress Jung Siren
కాంగ్రెస్ జంగ్ సైరన్

By

Published : Oct 3, 2021, 5:01 AM IST

కాంగ్రెస్‌ పార్టీ నూతన కార్యవర్గం ఏర్పాటైన తరువాత చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు విజయవంతం కావడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై పోరాటానికి శ్రీకారం చుట్టింది. గాంధీజయంతి రోజున మొదలుపెట్టి డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్రం సాకారమైన రోజు, సోనియాగాంధీ పుట్టిన రోజు(Sonia Gandhi Birth Day)న ముగించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే విద్యార్థి సమస్యలపై జంగ్‌ సైరన్‌ (Congress Jung Siren)) పేరుతో చేపట్టిన కార్యక్రమం రసాబాసగా మారింది.

ముందస్తు అరెస్టులు...

దిల్‌సుఖ్‌నగర్‌ రాజీవ్‌ చౌక్‌ నుంచి ఎల్బీనగర్‌ సర్కిల్‌ వరకు పాదయాత్ర నిర్వహించి అక్కడ తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారికి నివాళులు అర్పించి అక్కడే సభలాంటిది నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం అనుమతి కోరగా పోలీసులు నిరాకరించారు. అనుమతి లేకపోయినా చేసి తీరతామని పీసీసీ ప్రకటించగా... పోలీసులు అప్రమత్తమయ్యారు. రాచకొండ, హైదరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు. దిల్‌సుఖ్​నగర్‌, ఎల్బీనగర్‌ సర్కిల్ వద్ద వందలాది మంది పోలీసులు మోహరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థి, నిరుద్యోగ యువత తరలివచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఎక్కడిక్కడ కట్టడి చేసే కార్యక్రమాల్లో భాగంగా ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధం చేశారు.

ఉద్రిక్తం...

కార్యక్రమం నిర్వహించి తీరాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దిల్‌సుఖ్​నగర్‌ వద్దకు వచ్చిన వారిని వచ్చినట్లు హైదరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు చెందిన పోలీసులు అరెస్టులు చేశారు. ఎల్బీనగర్‌ వద్ద విడతల వారీగా వచ్చిన వారిని వచ్చినట్లు పోలీసులు అరెస్టు చేస్తూ వచ్చారు. ఇంతలో ఒక్కసారిగా 2వేల మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు... తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు దూసుకురావడం వల్ల అక్కడున్న పోలీసులు ఏం చేయలేకపోయారు. పోలీసులు తేరుకునే లోపు శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ముఖ్యులు అరెస్ట్...

పోలీసుల సంఖ్య తక్కువ కావడం, కార్యకర్తలు, నాయకులు ఎక్కువ మంది ఉండడం వల్ల కట్టడి చేసేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. లాఠీఛార్జీ చేయడం వల్ల పలువురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులతోపాటు విలేకరులు, పోలీసులు కూడా గాయాలపాలయ్యారు. ఒకరిద్దరికి కాంగ్రెస్‌ కార్యకర్తలకు చేతులు విరగ్గా... పలువురు స్పృహ తప్పి పడిపోయి ఆస్పత్రిపాలయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ గౌడ్‌, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లురవి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తదితరుర ముఖ్యలు అరెస్టు అయ్యారు.

రేవంత్​ నిరసన...

గాంధీభవన్‌ నుంచి ప్రగతిభవన్‌ వద్ద ముట్టడికి వెళ్లేందుకు యత్నించిన మహిళ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, పీసీసీ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ ప్రీతమ్‌లను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌లతోపాటు పలువురిని ముందస్తు అరెస్టు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జంగ్‌ సైరన్‌ కార్యక్రమానికి హాజరు కాకుండా ముదస్తుగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రేవంత్‌ రెడ్డి అక్కడే బైఠాయించారు.

ఒక ఎంపీగా తాను తన నియోజక వర్గంలో పర్యటించే అధికారం లేదా అని నిలదీశారు. తనను అడ్డుకోవడం అంటే తన హక్కులకు భంగం కలిగించడమేనని స్పష్టం చేసిన రేవంత్‌ రెడ్డి... ఎలా అడ్డుకుంటారని పోలీసులను ప్రశ్నించారు. గాంధీ జయంతి కావడం వల్ల తాము శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇలా అడ్డుకుంటే బాగుండదని పోలీసులతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

విజయవంతం..

ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా.. వందలాది మంది పోలీసులతో కట్టడి చేసేందుకు యత్నించారు. అయినా కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు అనుకున్న చోటకు వెళ్లి శ్రీకాంతా చారితోపాటు అంబేద్కర్‌, జగ్‌జీవన్‌రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ తమ కార్యక్రమం విజయవంతమైందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చూడండి: No permission for Jung Siren Rally : ర్యాలీకి అనుమతిలేదు.. అడ్డుకుంటే సహించేది లేదు

ABOUT THE AUTHOR

...view details