బస్తీమే సవాల్: ఓటర్లకు డబుల్, త్రిబుల్ బొనాంజాలు ఓటర్లకు ఎన్నికల బొనాంజాలు
పురపోరులో విజయమే లక్ష్యంగా భారీ ఎత్తున డబ్బు, మద్యం, ఇతర తాయిలాల పంపిణీతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ద్విముఖ పోటీ నెలకొన్న వార్డులు..డివిజన్లలో పోటాపోటీగా ఓటర్లకు తాయిలాల పంపిణీ మరింత ఎక్కువగా ఉంది. భాజపా లేదా స్వతంత్ర అభ్యర్థి రూపంలో త్రిముఖ పోటీ ఉన్న చోట్ల ఓటర్లు డబుల్, త్రిబుల్ బోనాంజాలు అందిస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా రోజుకు లక్షల్లో ఖర్చు
రియల్ ఎస్టేట్ వ్యాపారంపరంగా ప్రాధాన్యతగల ఈ పురపాలికల్లోని కొందరు ‘బడా అభ్యర్థులు’విచ్చలవిడిగా ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్, మేయర్ పదవిని ఆశిస్తున్న అభ్యర్థులైతే గెలుపే లక్ష్యంగా రోజూ లక్షల రూపాయల్లో ఖర్చు పెడుతున్నారు.
పండగ ముగిసినా తాయిలాల మత్తు
ఒకరు చికెన్ ఇస్తే.. మరొకరు మటన్ ఇవ్వడం.. ఒక పార్టీ అభ్యర్థి బీరు బాటిళ్లు ఇస్తే.. మరొక పార్టీ అభ్యర్థి ఫుల్ బాటిళ్లు. ఇలా సాగుతోంది మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం. ఎన్నికల ముంగిట సంక్రాంతి పండుగ రావడంతో అభ్యర్థులు తాయిలాల పంపిణీకి తెరతీశారు. భోగి, సంక్రాంతి, కనుమ నేపథ్యంలో వరసగా మూడురోజులూ రాష్ట్రవ్యాప్తంగా చాలా పురపాలికల్లో విచ్చలవిడిగా ఇంటింటికీ పండుగ ప్యాకేజీలను సరఫరా చేశారు. ఖర్చులన్నీమావే.. మీకేం ఫికర్ కావద్దు’అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. పండగ ముగిసినా తాయిలాల మత్తు మాత్రం వదలట్లేదు.
పోటీపడి మరీ మద్యం, మాంసం పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా... ఎన్నికలు ఉన్న అన్ని వార్డులు, డివిజన్లలో ఇదే తంతు కనిపిస్తోంది. అభ్యర్థులు పోటీ పడి మరీ చికెన్, మటన్, మద్యం పంపిణీ చేస్తున్నారు. ఫుల్ బాటిల్ విస్కీ లేదా ఐదారు బీరు సీసాలతో ప్యాకేజీలు మూటగట్టి ఓటర్లకు పంపిణీ చేశారు. వివిధ పార్టీల అభ్యర్థులు యువజన సంఘాలను ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నారు. ఇందు కోసం పలు డివిజన్లు, వార్డుల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించడంలో చివరి నాలుగు రోజులు కీలకంగా ఉండటం వల్ల మరింత భారీగా ఈ తరహా ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
బస్తీమే సవాల్: కాలం మారింది..సెల్‌ఫోన్‌తో ఇస్మార్ట్ ప్రచారం