లాక్‌డౌన్ ఎత్తివేతతో ఆలయాల్లో భక్తుల సందడి మొదలైంది. కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివార్ల దర్శనాలకు అనుమతిస్తుండటంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో దర్శనాలు పున:ప్రారంభమయ్యాయి. కరోనా ఉద్ధృతి కారణంగా 38 రోజులుగా నిలిచిపోయిన దర్శనాలు.. దేవాదాయ శాఖ వారి ఉత్తర్వుల మేరకు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. బాలాలయంలో స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతిస్తున్నారు.
46 రోజుల తర్వాత రామయ్య దర్శనం..
భద్రాచలంలో 46 రోజుల తర్వాత దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. సీతారామ చంద్రస్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం.. నిత్య కల్యాణాలు ప్రారంభించారు. నేటి నుంచి ఆలయంలో దర్శనాలకు అనుమతిస్తున్నట్లు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో భక్తులు తక్కువ సంఖ్యలోనే వచ్చారు.
వేములవాడ రాజన్న..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. నెల రోజుల తర్వాత ఆలయ గుడి తలుపులు తెరుచుకోవడంతో భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఐదో శక్తిపీఠంలోనూ..
ఐదో శక్తిపీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయానికి పోటెత్తి.. తమ మొక్కులు తీర్చుకున్నారు. చాలా రోజుల తర్వాత స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.