భక్తులకు మనవి..ఆలయాల్లో ఇవి పాటించండి..! - 8 నుంచి తెరుచుకోనున్న ఆలయాలు, హోటళ్లు
దేశవ్యాప్తంగా జూన్ 8 నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వగా.. ఇందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభత్వం జీవో 75ను జారీ చేసింది. ఒకవేళ ఇవి కట్టడి ప్రాంతాల్లో ఉంటే వీటిని మూసే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు 40 అంశాలతో కూడిన మార్గదర్శకాలను కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది.
భక్తులకు మనవి ఆలయాల్లో ఇవి పాటించండి..!
లాక్‌డౌన్ 5.0లో దేశవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తున్నా తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్రం సూచించింది. గుళ్లు, ప్రార్థనా మందిరాలను సోమవారం నుంచి తెరిచే వీలు కల్పిస్తున్న నేపథ్యంలో 40 అంశాలతో సవివరమైన మార్గదర్శకాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం దీనికి అనుగుణంగా జీవో 75ను జారీ చేసింది.
అలయాలు, ప్రార్థన మందిరాల్లో ఇలా..
- గుళ్లు, ప్రార్థన మందిరాలకు సందర్శకులను దశలవారీగా వదలాలి.
- భక్తి గీతాలను బృందాలుగా ఆలపించకుండా రికార్డు చేసినవి వినిపించాలి.
- ప్రసాదం, తీర్థం ఇవ్వడం, పవిత్ర జలం జల్లడం వంటివి చేయకూడదు.
- అన్నప్రసాద తయారీలో, వితరణలో తప్పకుండా భౌతికదూరం పాటించాలి.
- విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా చూడాలి.
- భక్తులు పాదరక్షలను తమ సొంత వాహనాల్లోనే వదిలి రావడం మేలు. లేదంటే వాటిని ప్రత్యేకంగా ఉంచుకోవాలి.
- ప్రార్థనలకు తివాచీలను భక్తులు తమ వెంట సొంతంగా తెచ్చుకునేలా చూడాలి.