వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఓ వైపు ఎండలు, మరో వైపు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలవుతున్న వేడి సెగలు రాత్రి ఏడు గంటలైనా తగ్గడం లేదు. రాష్ట్రంలో వారం కిందట 35.8 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 40 డిగ్రీలకు చేరుకుంది. మంగళవారం 23 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్ దాటింది. అత్యధికంగా కుమురంభీం జిల్లాలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో అత్యధికంగా 42 డిగ్రీల మేర, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి..
వాయువ్య, ఉత్తర దిక్కుల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మధ్యస్థ భారతదేశంతో పాటు రాజస్థాన్ నుంచి వేడిగాలులు వీస్తుండడం వల్ల తేమ శాతం తగ్గిందని అధికారులు తెలిపారు. దీని కారణంగానే ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని... పలుజిల్లాల్లో 43 డిగ్రీలు నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు.