Temperatures Dropped in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. చలి కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాస, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు చలి ప్రభావానికి లోనుకాకుండా ఉండాలంటున్నారు. చలి ఎక్కువగా ఉంటే ఇంట్లో ఉన్నా సరే స్వెట్టర్, మంకీ క్యాప్ లాంటివి ధరించాలని తెలిపారు. వృద్ధుల ఆరోగ్యంపై చలి తీవ్రత ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గజగజ వణుకుతున్న తెలంగాణ - ఉన్ని దుస్తులకు పెరిగిన గిరాకీ
Winter Safety Tips For Senior Citizens : వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున పలు జాగ్రత్తలు తీసుకోవాలని, శీతల వాతావరణంలో వృద్ధులు బయటకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద వయసు వారిపై చలి ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో వైరల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అధిక రక్తపోటు, మధుమేహం తదితర దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి చలి కారణంగా పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
చలి కాలంలో శరీరంలోని రక్తనాళాలు సంకోచించడంతో ముప్పు పెరుగుతుంది. రక్తనాళాల్లో చిన్న చిన్న బ్లాకులు ఉంటే ప్రసరణలో అడ్డంకుల కారణంగా గుండె, మెదడుకు సరఫరా ఆగిపోయి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెపుతున్నారు. ఇప్పటికే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ), బ్రాంకైటిస్, న్యుమోనియా తదితర సమస్యలున్న వారిపై మరింత ప్రభావం చూపుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.