Global Temperature rise : ఎండాకాలం... ఒకప్పుడు 35డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే మహా అనుకునేవారు. ఎవ్వరికి అంతలా ఎండల తీవ్రత తెలిసేది కాదు. కానీ, గత కొన్నేళ్ల నుంచి 45, 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే... అమ్మో ఇంత ఎండలు ఎలా తట్టుకోవాలి అంటున్నారు. అయితే ఇదంతా మానవ తప్పిదాల వల్లే అనేది అక్షర సత్యం. ఎందుకంటే మనం చేసే చిన్నచిన్న తప్పులే పుడమికి ముప్పులా మారాయి. గతంతో పోల్చుకుంటే జనాభా బాగా పెరిగింది. జనాల అవసరాలు కూడా పెరిగాయి. దీంతో ప్రకృతి కాలుష్యం, వాతావరణ మార్పులకు తెరతీసినట్లు అయ్యింది.
అరడిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే అల్లకల్లోలమే :ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబాలు ఒకప్పుడు ఏసీ వాడుతుండేవారు. కానీ, ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటికి ఓ ఏసీ, రిఫ్రేజ్‌రేటర్ తప్పనిసరిగా వినియోగిస్తున్నారు. అలాగే కరోనాకు ముందు వ్యక్తిగత వాహనాలు కలిగి ఉన్నవారు చాలా తక్కువ. ప్రస్తుతం చాలా మంది చిన్న చిన్న ఉద్యోగస్థులు కూడా వ్యక్తిగత వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడిదే భూమి పాలిట శాపంలా మారనుంది. ఎందుకంటే అనేక కారణాలతో భూతాపం పెరగనుంది. అందులో భాగంగా ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ 2 డిగ్రీల దాకా వెళ్లకుండా చూసుకోవాల్సిందేనని ఐక్యరాజ్యసమితి తాజాగా హెచ్చరించింది.
Global Temperature rise causes climate damage: ఒకప్పటితో పోలిస్తే వాహనాల వినియోగం పెరిగిపోయింది. దీంతో కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున విడుదల అవుతున్నాయి. మన దేశంలోని ప్రముఖ మెట్రోపాలిటన్ నగరాలన్నీ ప్రధాన కాలుష్య నగరాల జాబితాలో ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఆయా నగరాల్లో పరిశ్రమలు, వాహనాల నుంచి విడుదల అవుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర నరకం చూస్తున్నారు. అలాగే భవిష్యత్‌లో ఇంతకంటే మరిన్ని కష్టాలు చవిచూస్తారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు అటవీ ప్రాంతాలు కుంచించుకపోవడం కూడా భూతాపానికి ప్రధాన కారణంగా కన్పిస్తోంది. దీంతో ప్రచండమైన ఎండలు, అకాల వర్షాలు సర్వసాధారణమవుతున్నాయి.
అలా జరిగితే తీవ్ర సంక్షోభం... ఉత్పత్తుల్లో కొరత ఏర్పడటం ఖాయం : భూతాపంతో.... ఆర్థిక నష్టాలు కూడా ఉద్ధృతమయ్యాయి. రానున్న రోజుల్లో పెరిగే ఎండలతో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారి సంఖ్య తగ్గడం ఖాయమని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ముఖ్యమైన రంగాలకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలింది. రానున్న కాలంలో చాలా రంగాలలో ఎండల ప్రభావంతో శ్రామిక శక్తి తగ్గే అవకాశం ఉందని అంచనా. అలా జరిగితే తీవ్ర సంక్షోభం... ఉత్పత్తుల్లో కొరత ఏర్పడటం ఖాయంగా కన్పిస్తోంది.