తెలంగాణ

telangana

ETV Bharat / state

shashi panja: మమతా బెనర్జీ నమ్మకాన్ని నిలబెడుతున్నా! - తెలంగాణ వార్తలు

ఆమె తెలుగింటి ఆడపడుచు.. అతను బెంగాలీ ముద్దుబిడ్డ. వాళ్ల ప్రేమ బంగాల్ రాజకీయాల్లో కీలకమవ్వడమే కాదు... ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. మమతాబెనర్జీ నమ్మకాన్ని చూరగొని మూడోసారి మంత్రిగా ఎన్నికైన ఆమె మరెవరో కాదు.. శశి పంజా!

shashi panja political journey, bengal minister shashi panja
బంగాల్ మంత్రి శశిపంజా రాజకీయ జీవితం, బంగాల్ మంత్రి శశి పంజా

By

Published : Aug 6, 2021, 2:02 PM IST

తెలుగింటి ఆడపడుచు.. బెంగాలీ ముద్దుబిడ్డ ప్రేమ బంగాల్ రాజకీయాల్లో కీలకంగా మారింది. మమతాబెనర్జీ నమ్మకాన్ని చూరగొని మూడోసారి మంత్రిగా ఎన్నికయ్యారు శశి పంజా. బుధవారం హైదరాబాద్‌ తెలుగు విశ్వవిద్యాలయంలోని మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంస్కృతి పురస్కార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. నాన్న పీవీ కృష్ణయ్య ఐఐటీ ఖరగ్‌పుర్‌ తొలిబ్యాచ్‌ విద్యార్థి. చదువు పూర్తయిన తర్వాత అక్కడే హిందుస్థాన్‌ మోటార్స్‌లో ఉద్యోగం రావడంతో మా కుటుంబం కోల్‌కతాలో స్థిరపడింది. అన్నయ్య పీఎస్‌ మోహన్‌ కూడా బిట్స్‌లో చదివి అదే హిందుస్థాన్‌ మోటార్స్‌లో చేరాడు. మా స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. నరసరావుపేటలో పుట్టాను. నా చదువంతా హుగ్లీలో కొనసాగింది. ఆర్‌.జి.కర్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చేసి అక్కడే ఇన్‌ఫెర్టిలిటీ, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ విభాగంలో వైద్యురాలిగా పని చేశాను.

అజిత్‌ పంజా కుటుంబంలోకి..

మాజీ కేంద్రమంత్రి అజిత్‌కుమార్‌ పంజా కుమారుడు ప్రసూన్‌ కుమార్‌ మెడికల్‌ కళాశాలలో నా సహాధ్యాయి. మా ప్రేమను పెద్దలు అంగీకరించడంతో 1987లో పెళ్లి చేసుకున్నాం. అప్పటికి నాకు రాజకీయాలపై అవగాహన లేదు. పంజా కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టాక కూడా వైద్యవృత్తిని కొనసాగించాను. మావయ్యకు.. మా అత్తమ్మ జయ అండగా ఉండే వారు. ఇంట్లో ఎప్పుడూ రాజకీయ సందడి ఉండేది. 1996లో ఆమె చనిపోయారు. ఆవిడ బాధ్యతలు నేను తీసుకోవాల్సి వచ్చింది. 1998 తర్వాత అజిత్‌కుమార్‌ తృణమూల్‌లో చేరారు. నేనూ ఉత్తర కోల్‌కతా తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా ఇన్‌ఛార్జిగా వ్యవహరించాను. మావయ్య కేంద్రమంత్రిగా ఉండటంతో స్థానిక రాజకీయాలు నేనే చూసుకునేదాన్ని. 2008లో క్యాన్సర్‌తో ఆయన చనిపోయారు. అంతటితో మా కుటుంబానికి రాజకీయాలతో సంబంధం తెగిపోయిందని భావించాను. తర్వాత నా వృత్తిపైనే దృష్టి పెట్టాను.

ఆమెని కాదనలేక...

మావారికి రాజకీయాల్లో ఆసక్తి లేదు. ఆయన కోల్‌కతాలో చర్మవ్యాధుల నిపుణుడిగా పనిచేస్తున్నారు. పుట్టి పెరిగిన వాతావరణం అదే కావడంతో ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంటారు. 2010లో కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రకటన వచ్చింది. మమతబెనర్జీ నన్ను పిలిచి రాజకీయాల్లో రావాలని కోరారు. ఆమె విజ్ఞప్తిని కాదనలేక రాజకీయాల్లో అడుగుపెట్టాను. ఆ ఏడాది మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించాను. మరుసటి ఏడాదే అసెంబ్లీ ఎన్నికల్లో శ్యామ్‌పొకూర్‌ నియోజకవర్గం నుంచి గెలిచాను.

వరుసగా మంత్రి పదవి అందుకేనేమో..

2013లో మమత కేబినేట్‌లో మంత్రిగా అవకాశం దక్కింది. తొలుతగా మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి బాధ్యతలు చూశాను. 2014లో సాంఘిక సంక్షేమ శాఖను అప్పగించారు. 2016, 2021లోనూ గెలిచాక అదే శాఖకు మంత్రిగా ఉన్నా. మమతాబెనర్జీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తున్నందునే వరుసగా మంత్రి పదవి దక్కుతోందని అనుకుంటున్నా. బంగాల్‌ ప్రభుత్వం బాలికా విద్యని ప్రోత్సహించడంతోపాటు బాల్య వివాహాలను అరికట్టేందుకు ‘కన్యశ్రీ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తోంది. దాదాపు 75 లక్షల మంది బాలికలు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు. 18ఏళ్లు దాటిన యువతులకు విద్య కోసం రూ.25వేలు ఉపకార వేతనం అందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యతలు మమత నాకు అప్పగించారు. ఈ పథకానికి ఐక్యరాజ్యసమితి అవార్డూ దక్కింది.

-శశి పంజా

వైద్యం కొనసాగిస్తున్నా

చిన్నప్పుడు గుంటూరులో ఉండేవాళ్లం. సెలవుల్లో అమ్మమ్మ, తాతయ్య వాళ్లింటికి వెళ్లేదాన్ని. గుంటూరు నుంచి తెనాలి వరకు బస్సులో ప్రయాణం, పాత పట్టాభిపురంలో తెలుగు సినిమాలు చూడటం.. చాలా తీపి గుర్తులు ఉన్నాయి. 1989లో కేంద్రమంత్రిగా ఉన్న మా మామ అజిత్‌కుమార్‌తో కలిసి గుంటూరు వచ్చాం. నేను కేంద్ర మంత్రి కోడలినయ్యానని తెలుసుకుని స్థానికులు ఎంతో సంతోషించారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. వైద్య వృత్తిని కొనసాగిస్తుంటాను.

బెంగాల్‌ సంస్కృతి తెలియదన్నారు!

నాది తెలుగు నేపథ్యమని, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టానని, బెంగాలీ సంస్కృతి తెలియదని నా ప్రత్యర్థులు ఎప్పుడూ విమర్శలు చేసేవారు. కానీ మమతాబెనర్జీ అలాంటి భేదాలను చూడరు. అందుకే నాకు కౌన్సిలర్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇచ్చారు. నేను బెంగాలీ చాలా చక్కగా మాట్లాడతాను. బంగాల్‌ ప్రజలు నేను తెలుగు మాట్లాడితే అర్థమైనా... కాకపోయినా ఆసక్తిగా వింటుంటారు.

పిల్లలకు పూర్తి స్వేచ్ఛ

నాకు ఇద్దరు ఆడపిల్లలు.. పూజ, నమ్రత. పూజ తృణమూల్‌ కాంగ్రెస్‌ యువజన విభాగానికి రాష్ట్ర కార్యదర్శి. న్యాయవాదిగానూ పనిచేస్తోంది. చిన్నమ్మాయి వైద్యవిద్య చదువుతోంది.

చదవడం, రాయడం రాదు!

ఇంట్లో అమ్మతో తెలుగులో మాట్లాడతాను. బయట బెంగాలీ లేదా ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాను. తెలుగు భాషపై పట్టు తక్కువే. చదవడం, రాయడం రాదు. తెలుగుపైనా పట్టు సాధించాలని ఉంది.

ఇదీ చదవండి:'నవ భారతావనికి ఈ హాకీ వనితలు స్ఫూర్తి'

ABOUT THE AUTHOR

...view details