తెలంగాణ

telangana

ETV Bharat / state

రబీకి కృష్ణా నీరు కోరనున్న తెలుగు రాష్ట్రాలు

రబీ సీజన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి తెలుగు రాష్ట్రాలు భారీగా కృష్ణా జలాల కేటాయింపులు కోరనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే అధికారికంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాయగా, తెలంగాణ త్వరలోనే రాయనున్నట్లు తెలిసింది.

రబీకి కృష్ణా నీరు కోరనున్న తెలుగు రాష్ట్రాలు
రబీకి కృష్ణా నీరు కోరనున్న తెలుగు రాష్ట్రాలు

By

Published : Jan 8, 2021, 7:31 AM IST

రబీ సీజన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి తెలుగు రాష్ట్రాలు భారీగా కృష్ణా జలాల కేటాయింపులు కోరనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే అధికారికంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాయగా, తెలంగాణ త్వరలోనే రాయనున్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల అవసరాలు కలిపి సుమారు 200 టీఎంసీలకు పైగా ఉన్నాయి.

ఈ ఏడాది రెండు ఉమ్మడి రిజర్వాయర్లలోనూ నీటి నిల్వలు మెరుగ్గా ఉన్నందున రబీకి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. జనవరిలో రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, బోర్డు సభ్య కార్యదర్శితో కూడిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసి జలాల విడుదలపై నిర్ణయం తీసుకోవడానికి తమ నీటి అవసరాలను తెలపాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది.

* నాగార్జునసాగర్‌ కుడికాలువ, ఎడమకాలువ, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా విడుదల, హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకాలకు కలిపి 108.5 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ కోరింది. 2020 డిసెంబరు ఆఖరు వరకు అన్ని ప్రాజెక్టుల నుంచీ కలిపి 125.27 టీఎంసీలను మళ్లించినట్లు వెల్లడించింది. 2021 మార్చి 31 వరకు నాగార్జునసాగర్‌ కుడికాలువకు 60 టీఎంసీలు, ఎడమకాలువకు 14.60, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 9.3, హంద్రీ-నీవాకు 24.6 టీఎంసీలను కేటాయించాలని కోరింది.

* తెలంగాణ కూడా సుమారు 100 టీఎంసీలు కోరే అవకాశం ఉంది. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద రబీ ఆయకట్టుకు ఇవ్వాలని నిర్ణయించినందున 54 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఎ.ఎం.ఆర్‌.పి)కు 20 టీఎంసీలు అవసరమని సంబంధిత ఇంజినీర్లు నివేదించారు. కల్వకుర్తి ఎత్తిపోతల, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు ఇలా అన్నీ కలిపి త్వరలోనే తెలంగాణ ప్రతిపాదన ఇవ్వనుంది.

ABOUT THE AUTHOR

...view details