Bifurcation Issue Meet: తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజనాంశాలతో పాటు విభజన చట్టంలోని అంశాలపై ఇవాళ కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశం కానున్నారు. మొదట దిల్లీలో ప్రత్యక్ష సమావేశం అనుకున్నప్పటికీ కొవిడ్ కేసుల నేపథ్యంలో సమావేశాన్ని దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ తొమ్మిది అంశాలను ఎజెండాలో పొందుపర్చింది. విభజన చట్టం తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన, విద్యుత్ బకాయిలు, ఏపీ-ఎస్ఎఫ్సీ విభజన, సింగరేణి కార్పొరేషన్‌తో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజన, దిల్లీ ఏపీ భవన్ విభజన, విభజన చట్టంలో పొందుపర్చిన ప్రకారం పన్ను బకాయిలు, బ్యాంకు డిపాజిట్లలో మిగిలిన నగదు పంపకాల అంశాలు ఎజెండాలో ఉన్నాయి.
సిఫారసుల ప్రకారం...
సింగరేణి కార్పొరేషన్‌తో పాటు సంస్థకు అనుబంధంగా ఏపీలో ఉన్న అప్మెల్ విభజన వ్యవహారంలో ఏ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఆ రాష్ట్రానికే చెందుతాయని అటార్నీ జనరల్ న్యాయసలహా ఇచ్చారు. దానిపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంది. తొమ్మిదో షెడ్యూల్‌లోని సంస్థల విభజనకు సంబంధించి షీలాబిడే కమిటీ సిఫారసుల్లో అభ్యంతరం లేని వాటిపై ముందుకెళ్లి మిగతా వాటి విషయంలో విడిగా చర్చించాలని తెలంగాణ అంటోంది. అన్ని సంస్థల విషయంలో ఒకే విధంగా ముందుకెళ్లాలని ఏపీ వాదిస్తోంది. ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప మిగతా వాటి విషయంలో షీలాబిడే కమిటీ సిఫారసుల ప్రకారం ముందుకెళ్లాలని కేంద్ర హోంశాఖ సూచించింది.
జనాభా ప్రాతిపదికన...
ఏపీ ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ తదితర పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలు, సుప్రీంతీర్పు విషయంలో రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలతో ఉన్నాయి. ఏపీ ఆర్థికసంస్థ విభజన ప్రతిపాదనలను ఏకపక్షంగా తయారు చేశారని తెలంగాణ అంటోంది. పన్నుల వసూళ్లు, రీఫండ్‌ను జనాభా ప్రాతిపదికన పంచాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. స్థానికత ప్రాతిపదికన ఏపీకి కేవలం రూ. 3,021 కోట్లు మాత్రమే వస్తాయని, జనాభా ప్రాతిపదికన రూ. 6,841 కోట్లు వస్తాయని చెప్తోంది. ఈ ప్రతిపాదనతో విభేదిస్తోన్న తెలంగాణ... విభజన చట్టానికి అనుగుణంగానే నడుచుకోవాలని లేదంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని చెబుతోంది.