కొలిక్కిరానున్న తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఆగస్టు 8 న కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. దిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ సీఎస్లతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మొత్తం ఎనిమిది అంశాలను ఎజెండాలో పొందుపర్చారు. దిల్లీలోని ఏపీ భవన్ విభజన, సింగరేణి సంస్థకు చెందిన అప్మేల్ సంస్థ వివాదం, విద్యుత్ బకాయిలు, తొమ్మిది, పది షెడ్యూల్లోని సంస్థల విభజన తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి. ఏపీ భవన్ విభజనకు సంబంధించి ఏపీ ప్రతిపాదనలను తెలంగాణ అంగీకరించట్లేదు.
తొమ్మిది, పది షెడ్యూల్లోని అంశాలపై కూడా చర్చ
హైదరాబాద్ వారసత్వ సంపదగా సంక్రమించిన ఏపీ భవన్ పూర్తిగా తమకే చెందుతుందని.. దీని కోసం పరిహారం ఇచ్చేందుకూ సిద్ధమని తెలంగాణ స్పష్టం చేసింది. ఇక తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న అప్మేల్ సంస్థ అంశం కూడా కీలకంగా మారింది. 58:42 నిష్పత్తిలోనే అప్మేల్ను విభజించాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోంది. అప్మేల్లో 85 శాతానికి పైగా సింగరేణి సంస్థ పెట్టుబడులు ఉన్నందున అది సాధ్యం కాదని తెలంగాణ తెలిపింది. తెలంగాణ నుంచి 5,732 కోట్ల విద్యుత్ బకాయిలు రావాలని ఏపీ పేర్కొంది. ఏపీ నుంచి తమకు 2,405 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ వెల్లడించింది. వీటితో పాటు తొమ్మిది, పది షెడ్యూల్లో ఉన్న ఇతర సంస్థల విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు.
ఇవీ చూడండి : భాజపా నేతలను ప్రశ్నిస్తే అంతే: రాహుల్