Cricketer Geethika Kodali: కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన కొడాలి ప్రశాంత్, మాధవిల కుమార్తె గీతిక.. అమెరికాలోని నార్త్‌కరోలినాలో 12వ తరగతి చదువుతూనే క్రికెట్‌లో సత్తా చాటుతోంది. తక్కువ వయసులోనే అమెరికాలోని క్రికెట్ జట్టుకు సారథ్యం వహించే స్థాయికి ఎదిగింది. 11వ ఏట బ్యాట్ చేతపట్టి.. 14 ఏళ్లకే యూఎస్ మహిళా క్రికెట్ జట్టులో ఆడే అవకాశం దక్కించుకుంది. 17 ఏళ్లకు అండర్-19 జట్టుకు సారథ్యం వహిస్తోంది గీతిక కొడాలి. కెప్టెన్‌గా తమ బృందాన్ని విజయపథంలో నడిపిస్తూ తొలి సిరీస్‌లోనే విజయాన్ని అందుకుంది. యూఎస్ ఉమెన్స్ జట్టు కెప్టెన్‌గా వరల్డ్ కప్‌లో ఆడటమే లక్ష్యం అంటున్న గీతిక ‘ఈనాడు-ఈటీవీ-భారత్’తో పలు విషయాలను పంచుకుంది.
యూఎస్ మహిళా జట్టుకు ఎంపికై
చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం. కానీ క్రికెటే నా లోకం అవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అమ్మానాన్నల సూచనతో కోచ్ రఘును కలిశాం. శిక్షణ తీసుకుంటే క్రికెట్‌లో బాగా రాణిస్తావని ఆయన చెప్పారు. రెండేళ్ల శిక్షణ తర్వాత 14వ ఏట అమెరికన్ మహిళా జట్టులోకి వెళ్లే అవకాశం లభించింది. జట్టు ఎంపిక కోసం మూడు క్యాంప్‌లు జరిగాయి. 32 మంది హాజరయ్యారు. 14 ఏళ్ల విభాగంలో ఎంపికయ్యా. జట్టులో నేనే చిన్నదాన్ని. నేషనల్ ఉమెన్ క్రికెట్ లీగ్‌కు ఆడాను. సీనియర్ల నుంచి మెలకువలు నేర్చుకోవడంతోపాటు.. ఫిట్‌నెస్, బౌలింగ్ సామర్థ్యాలను మెరుగుపరుచుకున్నాను. కెనడా, మెక్సికో, జింబాబ్వే తదితర దేశాల్లో 20 మ్యాచ్‌లు ఆడాను.
అమ్మానాన్న సహకారంతోనే
అమ్మ మాధవి, నాన్న ప్రశాంత్ సహకారంతోనే క్రికెట్‌లో రాణిస్తున్నా. చిన్ననాటి నుంచి ఎంతో ప్రోత్సహించారు. నార్త్‌కరోలినా అయితే క్రికెట్‌కు మంచి సౌకర్యాలు ఉంటాయని.. నా కోసమే కాలిఫోర్నియా నుంచి నివాసం మార్చారు. ఇది నా చదువుకు కూడా దోహదపడింది. నా చిన్నతనంలో ఏటా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వాళ్లం. హైస్కూల్‌కు వచ్చాక సమ్మర్ ఇంటర్న్‌షిప్‌తో అవకాశం కుదరలేదు. ఈ లోగా కొవిడ్ రావడమూ కారణమైంది. త్వరలో ఇండియాకు వస్తాను. మన గడ్డపై కూడా క్రికెట్ ఆడతాను.