తెలంగాణ

telangana

ETV Bharat / state

TS teachers Transfers : సర్వీస్ సీనియారిటీకే సర్కార్ ప్రాధాన్యం.. వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు - తెలంగాణలో ఉపాధ్యాయల బదిలీ

TS teachers Transfers : కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ జరుగుతోంది. హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల ఉద్యోగులను 32 కొత్త జిల్లాలకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవో నం.317లో కొత్త జిల్లాల స్థానికతను పక్కనబెట్టి సర్వీసు సీనియారిటీకి ప్రాధాన్యమివ్వడాన్ని పలువురు ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు.

TS Employees Transfers
TS teachers Transfers

By

Published : Dec 12, 2021, 7:04 AM IST

TS Employees Transfers : సీనియారిటీ ఉంటే చాలు.. స్థానికేతర ఉపాధ్యాయులైనా కోరుకున్న జిల్లాకు వెళ్లొచ్చు. స్థానికులైనా జూనియర్లు సొంత జిల్లాను వదిలి వేరే జిల్లాకు బదిలీ అవుతారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో నం.317లో కొత్త జిల్లాల స్థానికతను పక్కనబెట్టి సర్వీసు సీనియారిటీకి ప్రాధాన్యమివ్వడమే ఇందుకు కారణం. దీన్ని పలువురు ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. తాము పుట్టి పెరిగిన, చదివిన జిల్లాను వదిలి మరో జిల్లాకు వెళ్లాల్సి వస్తుందని.. మరోవైపు కొన్ని జిల్లాలవారికి జోన్‌ సైతం మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికత ఆధారంగానే జిల్లాలు కేటాయించాలని కోరుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే కొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిసింది.

స్థానికేతర కోటాలో చేరినవారైనా..

Telangana Employees : రాష్ట్రంలో 1.09 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిని కొత్త జిల్లాల వారీగా కేటాయించేందుకు జారీ అయిన జీవో నం.317 ప్రకారం పాత(ఉమ్మడి) జిల్లాల్లో సర్వీసు సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. స్థానికేతర కోటాలో చేరినవారైనప్పటికీ.. వారు ఇచ్చే ఆప్షన్‌ ప్రకారం జిల్లాను కేటాయిస్తారు. స్థానికులైనప్పటికీ జూనియర్లు మరో(కొత్త) జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది. సాధారణంగా బదిలీ అయితే కొన్నేళ్లకు మళ్లీ కోరుకున్న ప్రాంతానికి రావొచ్చు. కానీ, కొత్త జిల్లాలవారీగా కేటాయింపులు శాశ్వతం. అంటే సర్వీసు అంతా అదే జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. దీనిపై వారు ఆవేదన చెందుతున్నారు. ‘నేను వరంగల్‌లో పుట్టి పెరిగాను. ఇక్కడే చదువుకున్నాను. వరంగల్‌ జిల్లాలో పనిచేస్తున్నా. సీనియారిటీ ప్రకారం మహబూబాబాద్‌ జిల్లాకు వెళ్లాల్సి వస్తోంది. మరో 20 ఏళ్లు అక్కడే పనిచేయాల్సి ఉంటుంది’ అని ఓ ఉపాధ్యాయుడు వాపోయారు. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులకు, మంత్రికి పలు ఉపాధ్యాయ సంఘాలు వినతిపత్రాలు సమర్పించాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా స్థానికత ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం జరిగిందని అధికారులు చెబుతున్నారు. 20 శాతం కోటాలో స్థానికేతరులు సైతం కొలువులు పొందారని, వారికి స్థానికత ఎలా వర్తిస్తుందని ఓ అధికారి ప్రశ్నించారు.

ఉపాధ్యాయుల్లో గందరగోళాన్ని నివారించాలి: టీఎస్‌యూటీఎఫ్‌

సీనియారిటీ జాబితాలను సమగ్రంగా రూపొందించి ఉపాధ్యాయుల్లో నెలకొన్న గందరగోళాన్ని నివారించాలని టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. నూతన జిల్లాల వారీగా ఉపాధ్యాయుల కేటాయింపు కోసం రూపొందిస్తున్న జాబితాలు లోపభూయిష్ఠంగా ఉన్నాయని, పలు జిల్లాల్లో అప్పీల్‌ చేసుకునే సమయమూ ఇవ్వడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి పేర్కొన్నారు. స్థానికతనూ పరిగణనలోకి తీసుకొని కొత్త జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని వారు డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:TS Employees Transfers: రేపటి నుంచే ఉద్యోగులకు ఐచ్ఛికాలు

ABOUT THE AUTHOR

...view details