తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS Ministers about Rosaiah : 'రోశయ్య లేని లోటు ఎవరూ తీర్చలేనిది' - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Ministers about Rosaiah : మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపట్ల మంత్రులు సంతాపం తెలిపారు. రోశయ్య నివాసానికి చేరుకున్న నేతలు... భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

Ministers about Rosaiah, Rosaiah death
తెరాస మంత్రుల సంతాపం

By

Published : Dec 4, 2021, 2:09 PM IST

Updated : Dec 4, 2021, 5:35 PM IST

Ministers about Rosaiah : మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని అంటున్నారు.

Harish rao about Rosaiah : రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న నేతగా రోశయ్య గుర్తింపు పొందారని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. విపక్షాలను సైతం మెప్పించే నేర్పరితనం ఆయన సొంతమని చెప్పారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసంలో నివాళులు అర్పించిన హరీశ్‌ రావు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

'రోశయ్య మరణం తెలుగురాష్ట్రాలకు తీరనిలోటు. రోశయ్యతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రకటన వచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఆయనకు మిత్రులు ఉన్నారు. 15 సార్లు శాసనసభలో రాష్ట్ర బడ్జెట్​ ప్రవేశపెట్టిన ఘనత ఈయనకే దక్కుతుంది. ప్రతిపక్షాలను ఒప్పించి, మెప్పించగలిగే నేర్పరితనం ఆయన సొంతం. అనేక శాఖల్లో పని చేసి అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి.'

-హరీశ్‌రావు, ఆరోగ్యశాఖ మంత్రి

ktr about Rosaiah : రోశయ్య మరణం బాధాకరమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. శనివారం సాయంత్రం రోశయ్య భౌతికకాయానికి మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు.

'వాడివేడి చర్చల్లోనూ హాస్యోక్తులతో వాతావరణం చల్లబరిచేవారు. రోశయ్య రాజకీయాలకు అతీతంగా స్పందించేవారు. రోశయ్య అంత్యక్రియలు ప్రభుత్వపరంగా సాగాలని ఆదేశించాం.'

-మంత్రి కేటీఆర్‌

శ్రీనివాస్ గౌడ్ సంతాపం

Srinivas Goud about Rosaiah : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి రోశయ్యకు హైదరాబాద్ అంటే చాలా అభిమానమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తాను చనిపోతే అంత్యక్రియలు హైదరాబాద్​లోనే చేయాలని చెప్పారని గుర్తు చేశారు. ఆయన మర్యాద చాలా గొప్పదని... చాలా గొప్ప రాజకీయ నాయకుడు అన్ని అభిప్రాయపడ్డారు. ఆయనను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసంలో నివాళులు అర్పించారు.

తలసాని దిగ్భ్రాంతి

Talasani srinivas yadav about Rosaiah : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన మృదుస్వభావి అని పేర్కొన్నారు. రాజకీయాలకే వన్నె తీసుకొచ్చిన గొప్పవ్యక్తి అని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు అమీర్‌పేటలోని రోశయ్య నివాసంలో నివాళులు అర్పించారు.

'రోశయ్య మానవతావాది. వారితో శాసనసభలో పనిచేసే అవకాశం నాకు కూడా వచ్చింది. ఆయనకు, నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ విధమైన పరిస్థితి వస్తదని ఎప్పుడూ ఊహించుకోలేదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.'

-తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి

మంత్రుల సంతాపం

రోశయ్య మృతి పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనలేని లోటు ఎవరూ తీర్చలేనిదని... వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

'రోశయ్య అనేక పదవులను అలంకరించి... ఆ పదవులకు వన్నెతెచ్చారు. మంచి మాటకారి. తనదైన నుడికారం, చమత్కారం, వ్యంగ్యమైన వ్యాఖ్యలతో అందరి మన్ననలు పొందారు. వ్యక్తిగత, సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.'

-ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి

మంత్రుల నివాళి

రోశయ్య తండ్రి సమానులని... ఆయనలేని లోటు ఎవరూ పూడ్చలేనిదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో భర్త చనిపోతే... ఎన్నోసార్లు తనను ఓదార్చారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా పని చేసిన రాజకీయ కురువృద్ధుడు రోశయ్య మరణం రాజకీయాలకు తీరని లోటని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రోశయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఎన్నో పదవులు అలంకరించి... వాటికి వన్నె తెచ్చిన వ్యక్తి రోశయ్య అని.. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తనదైన నేర్పుతో ఆకట్టుకునేవారని గుర్తు చేసుకున్నారు. రోశయ్యకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులు అర్పించారు.

తెరాస మంత్రుల సంతాపం
Last Updated : Dec 4, 2021, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details