TRS leaders on singareni strike: సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని తెరాస ఎంపీలు వెంకటేశ్ నేత, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా ఎంపీలు బండి సంజయ్, అర్వింద్.. దమ్ముంటే పార్లమెంటులో బొగ్గు గనుల వేలంపై మాట్లాడాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. మోదీ సర్కారు కార్మిక, దళిత, రైతు వ్యతిరేకమని పార్టీ నేతలు ధ్వజమెత్తారు.
అప్పుడే లేఖ రాశారు..
బొగ్గుగనులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత విమర్శించారు. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను తెలంగాణకు ఇవ్వాలని 2015లోనే నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారని ఎంపీ వెంకటేశ్ అన్నారు. సింగరేణి కార్మికులు ఏ స్థాయిలో ఆందోళన చేసినా సంఘీభావంగా ఉంటామని వెంకటేశ్ పేర్కొన్నారు. గుజరాత్, రాజస్థాన్లోని గనులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చినప్పుడు.. తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
సింగరేణి ద్వారా 10 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికుల పట్ల.. కేసీఆర్ చిత్తశుద్ధిగా వ్యవహరించారు. వారికి ఆదాయపు పన్ను మినహాయింపు చేస్తూ కేసీఆర్.. అసెంబ్లీలో తీర్మానం చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టారు. కానీ కేంద్రం మాత్రం.. బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసి.. వారికి అన్యాయం చేయాలని చూస్తోంది. సింగరేణి కార్మికులకు అండగా ఉంటాం.
- వెంకటేశ్ నేత, పెద్దపల్లి ఎంపీ
కలిసి పోరాడతాం..
తెరాస ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని కేంద్రం మొండిగా వ్యతిరేకిస్తోందని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ధ్వజమెత్తారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని... తమతో కలిసి వచ్చే వారిని కలుపుకొని పోరాడతామని స్పష్టం చేశారు.