కేంద్రంపై పోరాడటంలో తెరాస ఘోరంగా విఫలమైంది: రేవంత్‌రెడ్డి Revanth Reddy on paddy procurement: ధాన్యం కొనుగోళ్ల విషయంపై కేంద్రంపై పోరాటంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతుల జీవితాలను మోదీ వద్ద కేసీఆర్ తాకట్టు పెట్టారని విమర్శించారు. తెరాస, భాజపా తోడు దొంగలుగా మారి రైతులకు ద్రోహం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యాసంగి పంట కొనబోమని కేంద్రం ముందే చెప్పినా ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో.. రాష్ట్ర ప్రభుత్వంపై రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహాన్ని రైతులకు వివరించేందుకు ఈ నెల 27న ఎర్రవెల్లిలో మధ్యాహ్నం 2 గంటలకు రచ్చబండ కార్యక్రమం చేపడుతున్నట్లు రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా హాజరవుతారని.. పార్టీలకతీతంగా రైతులు, రైతు సంఘాల నాయకులందరూ రావాలని పిలుపునిచ్చారు. అన్నదాతల్లో విశ్వాసం కలిగించేందుకే ఈ రచ్చబండ అని స్పష్టం చేశారు.
మేమే కొంటాం
'కేంద్రం కొనుగోలు చేసినా, చేయకపోయినా రైతులు పండించిన ధాన్యం కొనగలిగే సత్తా రాష్ట్రానికి ఉంది. రూ.2లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రం.. రైతుల కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయలేదా.? ఆ డబ్బు మాకివ్వండి. కిసాన్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి ధాన్యాన్ని మేమే కొనుగోలు చేసి విదేశాలకు అమ్ముతాం. ఆ తర్వాత ఆ పది వేల కోట్లు మీకు ఇస్తాం. రైతుల సమస్యను పరిష్కరిస్తాం.' - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
పారిపోయి వచ్చారు
దిల్లీలో తెరాస మంత్రుల వైఖరి చూస్తుంటే.. వారు దీక్ష చేయడానికి అక్కడికి వెళ్లినట్లు లేదని రేవంత్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రం చేసుకున్న ఒప్పందం ప్రకారం బియ్యమే ఇవ్వలేదని కేంద్రం చెప్తోందన్నారు. అసలు మంత్రుల కార్యాచరణ ఏంటని.. ఈ ఆరు రోజుల్లో వారు తేల్చిందేంటని ప్రశ్నించారు. రాష్ట్రం, కేంద్రానికి మధ్య జరిగిన వ్యవహారం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్‌లో అదనపు ధాన్యం ఎంత ఇస్తారో చెప్పకుండా కొంటారా లేదా అని డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ధాన్యం కుప్పలతో మూడు నెలలుగా రైతులు అవస్థలు పడుతున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీకి వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోదీని కలవలేదని... రైతు సమస్యలను వివరించలేదని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసినా... నిర్దేశించిన లక్ష్యం మేరకు ఎఫ్‌సీఐకి బియ్యం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వరంగల్ గోడౌన్‌లో 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోల్‌మాల్‌పై కేంద్రం నిలదీస్తే అక్కడ నుంచి దొంగల్లా పారిపోయి వచ్చారని విమర్శించారు.
విహారం యాత్రలు చేస్తున్నారు
పార్లమెంట్‌లో నిరసన చేస్తామని చెప్పిన ఎంపీలు.. పోడియం వద్ద ఒక్క రోజు నల్ల చొక్కాలతో వచ్చి బాయ్‌కాట్ చేసి, సెంట్రల్ హాల్‌లో ఫొటోలు దిగి పార్లమెంట్‌లో ఆందోళన చేసినట్లు ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దిల్లీలో కాదు గల్లీలో తేలుస్తామని రాష్ట్రానికి వచ్చి పార్టమెంటు సమావేశాలు అయ్యాక మంత్రుల బృందం మళ్లీ దిల్లీకి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. ఖరీఫ్ పంట లక్ష్యాన్ని ఎందుకు పూర్తి చేయలేదో రైతులకు, కేంద్రానికి చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు చనిపోతుంటే కేటీఆర్, సంతోష్ కుమార్‌లు విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి:'కేంద్రం ధాన్యం కొనకపోతే మేమే కొని దిల్లీ గేటు ముందు పారబోస్తాం'