balka suman on etela: మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శలు గుప్పించారు. ఈటల రాజేందర్ భూములు కబ్జాకు పాల్పడినట్లు మెదక్ కలెక్టర్ ప్రకటించారని తెలిపారు. భూములను కబ్జా చేసినట్లు నిరూపణ అయినందున ఈటల రాజేందర్ ముక్కు నేలకు రాసి.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు, పేదల భూములను ఈటల తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భూములు కబ్జా చేసి.. ఎస్సీ, ఎస్టీ రైతుల కడుపు కొట్టి దుర్మార్గంగా ప్రవర్తించిన వీళ్లు.. మరలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని ముక్కు నేలకు రాయాలి.. ఈటల రాజేందర్. దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్టుగా కలెక్టర్ ఎట్లా చెబుతాడు. ప్రభుత్వ ఇలా ఎలా చేస్తోందని అంటున్నాడు. నేను అడుగుతున్నా ఇవాళ ఈటల రాజేందర్‌ను.. తప్పు చేసినట్లు నిరూపణ అయితే ముక్కు నేలకు రాస్తానని నువ్వే చాలా సందర్భాల్లో అన్నావు. ఇవాళ తప్పు చేసినట్లు నిరూపణ అయింది. 70.33 ఎకరాలు కబ్జా అని కలెక్టరే తేల్చిండు. ఇక తప్పు ఒప్పుకుని ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పేద రైతుల భూములు వాళ్లవి వాళ్లకు ఇచ్చేయాలి. కబ్జా చేసిన ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. రాబోయే రోజుల్లో చట్ట పరంగా ఏమేమి జరగాలో అవన్నీ జరుగుతాయి. ప్రభుత్వం కూడా ఇలాంటి కబ్జా కోరులను, ఇలాంటి దగాకోరులను.. నోరులేని పేదలు కదా అని చెప్పి, వాళ్ల పొట్ట కొట్టే దుర్మార్గుల పట్ల చాలా కఠినంగా ఉండాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. -బాల్క సుమన్, చెన్నూరు ఎమ్మెల్యే