తెలంగాణ

telangana

ETV Bharat / state

Crop Loans issues: యాసంగి సాగుపై కొరవడిన స్పష్టత.. నత్తనడకన పంట రుణాల ప్రక్రియ

Crop Loans issues: రాష్ట్రంలో యాసంగి పంటలపై స్పష్టత కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా కర్షకులకు సంస్థాగత రుణాలు అందకపోగా... రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నిర్దేశించిన లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో ఈ సీజన్‌లో ఇంకా ఇవ్వాల్సిన పంట రుణాలు 17 వేల కోట్లు మిగిలేఉన్నాయి. యాసంగి పంటలపై అనిశ్చితి నెలకొనడంతో రైతులు ముందుకు రావడంలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ గందరగోళం నుంచి బయటపడేసి ప్రభుత్వం భరోసా కల్పించాలని రైతు సంఘాలు సూచించారు.

Crop Loans issues in telangana
తెలంగాణలో పంట రుణాలు

By

Published : Dec 16, 2021, 12:44 PM IST

రాష్ట్రంలో నెరవేరని నిర్దేశించిన పంట రుణాల లక్ష్యం

Crop Loans issues in Telangana: రాష్ట్రంలో యాసంగి పంట రుణాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి రుణాల పంపిణీ లక్ష్యం రూ. 53 వేల కోట్లు నిర్దేశించగా... ఇంకా 17 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం వరి సాగు వద్దనడంతో... ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు స్పష్టత లేదు. ఫలితంగా రైతులు రుణాల కోసం రావడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. గతేడాది రాష్ట్రంలో 31 లక్షల మంది పంట రుణాలు తీసుకోగా ఈ ఏడాది ఇప్పటి వరకు వారిలో ఇంకా 15 లక్షల మంది పాత బాకీలు కట్టి కొత్త అప్పులు తీసుకోవడం లేదని అంచనా. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం కింద అప్పు మాఫీ అవుతుందని భావించిన కొందరు రైతులు.. పాత బాకీ కట్టడం లేదా రెన్యువల్‌కు కూడా ముందుకు రావడం లేదని బ్యాంకర్లు అంటున్నారు. ప్రభుత్వం వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలనడంతో... ఏ పంట వేయాలి? మద్దతు ధరలు వస్తాయా లేదా అనే కోణంలో కర్షకులు అయోమయంలో ఉన్నారు. ఈ ప్రభావం రైతులు, పంటరుణాలపై చూపుతోందని నిపుణులు అంటున్నారు.

స్పష్టత కరవు

ప్రణాళిక ప్రకారం రైతులు పంటలు వేసుకునేటప్పుడు.. దానికి అనుగుణంగా పెట్టుబడులకు సంబంధించి రుణాలు తీసుకుంటారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని చెబుతోంది. ఇవి రబీలో వేసుకోవాలి. ఇప్పటికే డిసెంబరు వచ్చింది. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి విత్తనాలు కూడా దొరకడం లేదు. దీంతో గందరగోళం నెలకొనడంతో.. రుణాల విషయంలో స్పష్టత రావడం లేదు. -కిరణ్‌కుమార్, కన్వీనర్, రైతు స్వరాజ్య వేదిక

వడ్డీ భారం

Crop Loans issues: పంట రుణం తీసుకున్న రైతులు నిర్ణీత గడువులోగా కట్టకపోతే అధిక వడ్డీ భారం పడుతోంది. రుణాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం సైతం బ్యాంకులు రైతులపైనే రుద్దుతున్నాయి. గడువులోగా అప్పు చెల్లించే రైతులతో పోల్చితే.... కట్టని వారిపై 2 రెట్లు అదనంగా వడ్డీ భారం పడుతోంది. ఫలితంగా లక్షలాది మంది రైతులు కట్టే వడ్డీ వందల కోట్ల రూపాయల్లో ఉంటోంది. గడువులోగా చెల్లిస్తే ఈ సొమ్మంతా రైతులకు మిగిలే అవకాశాలు ఉన్నప్పటికీ.... చాలా మంది వినియోగించుకోవడం లేదు. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న రైతుల్లో సగానికి పైగా అదనపు వడ్డీ భారం పడుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉండటంతో అధిక శాతం రైతులు.... ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి సమయంలో కర్షకుల్లో నెలకొన్న అనుమానాలు సర్కారు నివృత్తి చేసి... సాగుపై ఆంక్షలు ఉపసంహరించాలని రైతుసంఘాలు కోరుతున్నాయి. రుణాల పంపిణీ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

రుణ మాఫీ అమలు వైఫల్యం

రాష్ట్రంలో బ్యాంకింగ్ రుణ వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రెండు సార్లు రుణమాఫీ అమలు కాలేదు. రైతులు పూర్తి స్థాయిలో రుణాలు తీర్చలేకపోతున్నారు. బ్యాంకులు పూర్తిగా కడితే కానీ.. కొత్త రుణాలు ఇచ్చేది లేదని చెబుతున్నాయి. దీంతో ఎక్కువ మంది రైతులు బ్యాంకులకు వెళ్లడమే మానేశారు. -కన్నెగంటి రవి, సంపాదకులు, తొలకరి వ్యవసాయ మాసపత్రిక

ఆంక్షలు ఉండకూడదు

రైతులకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఏ పంట పండించినా దానికి కొనుగోలు వ్యవస్థ ఉండాలి. ఆ పంటలకు మద్దతు ధర నిర్ణయించాలి. పంట పండించడంలో రైతులకు స్వేచ్ఛ ఇవ్వాలి కానీ.. వారికి ఆంక్షలు విధించకూడదు. బ్యాంకింగ్​ వ్యవస్థ ప్రతి యేటా వ్యవసాయానికి ఇస్తామన్న నిష్పత్తిలో రుణాలను మంజూరు చేయాలి.

-కోదండరెడ్డి, ఉపాధ్యక్షుడు, అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ కమిటీ

యాసంగి పంటల రుణాల పంపిణీపై ప్రభుత్వం, వ్యవసాయశాఖ సమీక్ష జరిపి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిస్తే... ఆ ప్రక్రియ సాఫీగా సాగుతుందని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదీ చదవండి:ఉచిత మంచినీటి పథకం పొందే అవకాశం ఎప్పటివరకంటే..?

ABOUT THE AUTHOR

...view details