Covid effect on families: విధి బలీయమైంది.. రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రుల్ని దూరంచేసి వారికి పరీక్ష పెట్టింది. కొందరు కరోనాతో కన్నవారిని కోల్పోగా.. అనారోగ్యం, రోడ్డుప్రమాదాల కారణంగా అయినవారు మృత్యువాత పడడంతో మరికొందరు అనాథలుగా మారి అవస్థలు పడుతున్నారు. అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులు దూరమవ్వడంతో.. ఆ పిల్లల వ్యథ అంతా ఇంతా కాదు. తమ ఎదుగుదల చూసేవరకైనా తోడులేరనే బాధ వారిని నిత్యం వేధిస్తోంది. కరోనా కారణంగా గ్రేటర్ పరిధిలో సుమారు 655 మందికి పైగా పిల్లలు తల్లి లేదా తండ్రిని కోల్పోగా.., మరో 35 మంది ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మారారు. వారిలో కొందరు సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంటే.. మరికొందరు ప్రభుత్వం, దాతల ఆర్థిక సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సాయం చేయాలను కునేవారు 80080 55788 చరవాణి నంబరులో సంప్రదించగలరు.
ఎంబీఏ చేద్దామనుకున్నా కానీ..
వారం రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు దూరమయ్యారు. చెల్లెలిని, నన్ను ఉన్నత ఉద్యోగాల్లో చూడాలన్నదే వారి కోరిక. అది తీరకుండానే వారు మా నుంచి భౌతికంగా వెళ్లిపోయారు. నేను డిగ్రీ పూర్తి చేశాను. ఎంబీఏ చేయాలని భావించినా ఆర్థిక ఇబ్బందులతో సాధ్యపడలేదు. ప్రస్తుతం ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన చెల్లెలు హర్షిత ఉన్నత చదువులకు వీలుగా సాయమందించాలని కోరుతున్నా. -సుస్మిత, ఏఎస్‌రావునగర్
కన్న కుమార్తెలతో సమానంగా..