ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం బహిష్కరణకు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా గురువారం సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాక్ అసెంబ్లీ నిర్వహించనుంది. స్పీకర్‌గా కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి వ్యవహరిస్తారని తెలిపింది. ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్ శాసనసభా వ్యవహారాలు, ఆర్థికశాఖల మంత్రిగా, దువ్వారపు రామారావు వైద్య, ఆరోగ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్ పౌరసరఫరాలు, బుద్ధా వెంకన్న జలవనరులు, బుద్ధా నాగజగదీష్ దేవాదాయ, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్ వ్యవసాయం, గద్దే రామ్మోహన్ హోంశాఖ మంత్రులుగా వ్యవహరిస్తారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జీరో అవర్ సమన్వయకర్తగా ఉంటారు.
మొదటి రోజు కొవిడ్‌పై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తామని, ప్రభుత్వ వైఫల్యాలపై వీడియోలు, క్లిప్పింగ్‌లు ప్రదర్శిస్తామని తెదేపా తెలిపింది. దీనిపై దువ్వారపు రామారావు సమాధానం ఇచ్చిన అనంతరం, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష నేత ప్రసంగం ఉంటుందని వెల్లడించింది.