బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన తెలుగు అకాడమీ డిపాజిట్లను దొంగదారిన విత్ డ్రా చేసుకున్న నిందితులు ఆ డబ్బును పప్పు, బెల్లాల్లా పంచుకున్నారు. యూబీఐ కార్వాన్, సంతోష్ నగర్ ఖాతాల్లో రూ.54.5 కోట్లు.. చందానగర్‌లోని కెనరా బ్యాంకులో ఉన్న రూ.10 కోట్లను కొల్లగొట్టిన ముఠా సభ్యులు మొత్తం రూ.64.5 కోట్లు వాటాలుగా పంచుకున్నారు. ఇందులో అధిక వాటా తీసుకున్న వెంకటసాయి కుమార్ హైదరాబాద్ బాహ్యవలయ రహదారికి పక్కన 35 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. దుబాయి నుంచి తక్కువ ధరకు డీజిల్ వచ్చేలా ఏజెన్సీ ఇప్పిస్తానంటే ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇచ్చి మోసపోయినట్లు సీసీఎస్ పోలీసులకు తెలిపారు. యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీకి వచ్చిన రూ.2.5 కోట్ల డబ్బులతో ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధన కూడా 2 కోట్ల రూపాయలు తీసుకొని ఫ్లాట్లు కొనుగోలు చేసింది. కొంత నగదు ఉందని దాన్ని వెనక్కి తిరిగిచ్చేస్తామని పోలీసులకు తెలిపారు. మరో నిందితుడు వెంకటేశ్వర్ రావు రూ.3 కోట్లు తీసుకొని సత్తుపల్లిలో బహుళ అంతస్థుల భవనం నిర్మిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ శాఖల్లోని డబ్బులను డిపాజిట్ల పేరుతో కొల్లగొట్టేందుకు కృష్ణారెడ్డి, సాయికుమార్ కలిసి ముఠా ఏర్పాటు చేసి కథ నడిపించినట్లు పోలీసులు తేల్చారు.
11కు పెరిగిన అరెస్టులు
డిపాజిట్ల కుంభకోణంలో అరెస్టుల సంఖ్య 11కు చేరింది. కోయంబత్తూరుకు పారిపోయిన పద్మనాభన్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఏడాది కాల వ్యవధికి నగదు డిపాజిట్ చేయాల్సి ఉండగా నిందితులు యూబీఐ, కెనరా బ్యాంకుల్లో 15రోజుల వ్యవధికే చేశారు. ఆ డిపాజిట్ పత్రాలను తీసుకొని వాటిని కలర్ జిరాక్స్ తీసి ఏడాది కాలానికి డిపాజిట్ చేసినట్లు పద్మనాభన్ ఫోర్జరీ చేశాడు. ఆ పత్రాలను సోమశేఖర్ తీసుకెళ్లి తెలుగు అకాడమీ అధికారి రమేశ్ కు ఇచ్చారు. యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీని కస్టడీలో భాగంగా రెండో రోజు ప్రశ్నించారు. ముఠాకు, మస్తాన్ వలీకి మధ్య నడిచిన లావాదేవీల గురించి ప్రశ్నిస్తున్నారు. ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌ల కస్టడీ పిటిషన్ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ నెల 6వ తేదీన అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దీనిపై వాదనలు జరిగే అవకాశముంది. నిందితులందరినీ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:తెలుగు అకాడమీ కుంభకోణంలో సాయికుమార్దే కీలకపాత్ర..: సీపీ