railway concessions: ఈ నెల 16 నుంచి సాధారణ రైళ్లన్నింటినీ పునరుద్ధరించారు. రైల్వే రాయితీలను మాత్రం పునరుద్ధరించలేదు. దీంతో 60 రకాల రాయితీలకు ప్రయాణికులు దూరమయ్యారు. ఇటీవలే ఓ 14 రకాలకు మాత్రమే అనుమతి ఇచ్చి మిగతా అన్నింటికీ భారతీయ రైల్వే మంగళం పాడింది. అన్నీ సాధారణ రైళ్లు అయినప్పుడు.. రాయితీల విషయంలో ఎందుకీ కోత అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
సీనియర్ సిటిజన్లకూ ఊరట లేదు
railway reservations : పురుషులు 60 ఏళ్లు, మహిళలకు 58 ఏళ్లు పూర్తయినవారికి భారతీయ రైల్వే టికెట్‌లో 50శాతం రాయితీ ఇచ్చేది. అన్ని తరగతుల ప్రయాణాలకు వీటిని వర్తింపజేసింది. దశాబ్దాలుగా వీటిని కొనసాగించిన రైల్వే కరోనా మహమ్మారి తర్వాత రద్దు చేసింది. వైద్యులు, నర్సులు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధులు, క్రీడాకారులు, విధులకు వెళ్లే పోలీసులు, జర్నలిస్టులకు, పద్మ అవార్డు గ్రహీతలకు.. ఇలా 56 రకాలుగా ఇచ్చిన రాయితీలను కూడా రైల్వే రద్దు చేసింది. ప్రత్యేక రైళ్లు నడుపుతున్న సమయంలో అనవసర ప్రయాణాలను తగ్గించి.. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అంటూ దీనిపై రైల్వే దాటవేసింది. ఇప్పుడు సాధారణ రైళ్లు నడుపుతున్నా.. ఆ రాయితీలన్నింటినీ పునరుద్ధరించకుండా.. కంటి తుడుపుగా 14 రకాలకే పరిమితమైంది. అదీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లలో పూర్తి స్థాయిలో కాకుండా.. కోత విధించింది. గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ 14 రకాల్లోనూ కొందరిని పక్కన పెట్టింది.