తెలంగాణ

telangana

ETV Bharat / state

Chip Industry: టాటా భారీ సెమీ కండక్టర్ల పరిశ్రమపై తెలంగాణ ఆశలు - Chip Industry

టాటా గ్రూపు దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేయనున్న భారీ సెమీకండక్టర్ల (చిప్‌ల) పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. రూ. 2,200 కోట్ల పెట్టుబడితో నాలుగువేల మంది ఉపాధి పొందే వీలున్న పరిశ్రమ కావడంతో ఇది రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తమవుతుందని భావిస్తోంది.

Chip Industry
Chip Industry

By

Published : Nov 28, 2021, 5:20 AM IST

Chip Industry: దిగ్గజ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూపు దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేయనున్న భారీ సెమీకండక్టర్ల (చిప్‌ల) పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. రూ. 2,200 కోట్ల పెట్టుబడితో నాలుగువేల మంది ఉపాధి పొందే వీలున్న పరిశ్రమ కావడంతో ఇది రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తమవుతుందని భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే టాటా సంస్థ అయిదు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను నిర్వహిస్తుండడంతో పాటు ఇక్కడ అన్ని రకాల అనుకూలతలు ఉన్నందున మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణ వైపే మొగ్గుచూపే అవకాశం ఉండొచ్చని భావిస్తోంది.

చిప్‌ల యుగం...

ప్రపంచవ్యాప్తంగా చిప్‌ల (Chip Industry) యుగం నడుస్తోంది. దాదాపుగా అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాల్లోనూ వీటిని వాడుతుంటారు. ఇప్పటి వరకు చైనాలో భారీఎత్తున ఇవి ఉత్పత్తి అవుతున్నాయి. కరోనా అనంతరం చైనా ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గడంతో అన్ని దేశాలు దీనిపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో టాటా సంస్థ ఈ రంగంలోకి ప్రవేశించేందుకు నిర్ణయించింది. ఈ పరిశ్రమల ఏర్పాటు కోసం తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ అధికారులు తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించారు. మిగిలిన రాష్ట్రాలను సైతం పరిశీలించాక వచ్చే నెలలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలోనే ఎందుకు?

తెలంగాణలో ఇప్పటికే వైమానిక రంగంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్థిక మండలిలో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ మూడు భారీ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. అలాగే ఇక్కడ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) అతి పెద్ద ఐటీ ఉద్యోగాల కల్పన సంస్థగా ఉంది. టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. ఇలా తెలంగాణతో ఉన్న అనుబంధం దృష్ట్యా కొత్త పరిశ్రమను కూడా ఇక్కడే ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వవర్గాలు ఆశిస్తున్నాయి.

భూములు సిద్ధం

టాటా సెమీకండక్టర్‌ పరిశ్రమకు పది ఎకరాల వరకు స్థలం అవసరం. ప్రస్తుతం ఆదిభట్లలో ఉన్న సెజ్‌, ఎలక్ట్రానిక్‌ సిటీ తదితర చోట్ల భూములు అందుబాటులో ఉన్నాయి. ఇవి అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నాయి.

ఎప్పుడో ఏర్పాటు కావాల్సింది..

వాస్తవానికి తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమలు ఎప్పుడో ఏర్పాటు కావాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో ఫ్యాబ్‌సిటీ (Fab City) పేరిట ఈ పరిశ్రమల ఏర్పాటుకు సెమ్‌ ఇండియా సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల, శ్రీనగర్‌ గ్రామాల మధ్య 1200 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఒప్పందం అమలు చేయడంలో సెమ్‌ ఇండియా విఫలమైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రద్దు చేసి భూములను వెనక్కు తీసుకుంది. ఫ్యాబ్‌సిటీ స్థానంలో ఎలక్ట్రానిక్స్‌ సిటీని ఏర్పాటు చేసి, ఇతర సంస్థలకు భూములను కేటాయిస్తోంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details