తెలంగాణ

telangana

ETV Bharat / state

women safety wing: వేధించే ప్రవాసీ.. ఇక తప్పించుకోలేవు - hyderabad district news

ప్రవాస భారతీయుల గృహహింస కేసుల్లో రాష్ట్ర మహిళా భద్రత విభాగం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. గృహహింసకు పాల్పడుతూ తిరిగి బాధితురాళ్లపైనే ఫిర్యాదు చేస్తున్న ప్రవాస అల్లుళ్లకు సెగ తగిలేలా కార్యాచరణలో నిమగ్నమైంది. నిందితులపై క్రమం తప్పకుండా లుక్‌ అవుట్‌ నోటీస్‌లు జారీ చేయించడం, పునరుద్ధరణకు చొరవ చూపుతోంది.

women safety wing
women safety wing

By

Published : Oct 31, 2021, 8:04 AM IST

అమెరికాలో డాక్టర్‌గా గుర్తింపు పొందిన ఓ యువతి భర్త వేధింపులు భరించలేక పాపతో హైదరాబాద్‌కు వచ్చేసింది. పాపకు అమెరికా పౌరసత్వాన్ని సాకుగా చూపి ఆమెపై అమెరికాలో కిడ్నాప్‌ కేసు పెట్టాడా భర్త. ఈ కేసులో హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ వర్గాలు రాష్ట్ర పోలీసులను సంప్రదించాయి. తెలంగాణ మహిళా భద్రత విభాగం ప్రత్యేక చొరవతో ఆమె భర్త దాష్టీకాన్ని వారికి అర్థమయ్యేలా వివరించింది.

ప్రవాస భారతీయుల గృహహింస కేసుల్లో తెలంగాణ మహిళా భద్రత విభాగం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. గృహహింసకు పాల్పడుతూ తిరిగి బాధితురాళ్లపైనే ఫిర్యాదు చేస్తున్న ప్రవాస అల్లుళ్లకు సెగ తగిలేలా కార్యాచరణలో నిమగ్నమైంది. నిందితులపై క్రమం తప్పకుండా లుక్‌ అవుట్‌ నోటీస్‌లు జారీ చేయించడం, పునరుద్ధరణకు చొరవ చూపుతోంది. ఇప్పటివరకు అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్‌, బోట్సువానా, బహ్రెయిన్‌, సౌదీ.. తదితర 15 దేశాల్లోని ప్రవాసీయులపై తెలంగాణలో నమోదైన 728 గృహహింస కేసుల దర్యాప్తులో స్థానిక పోలీసులకు సాంకేతిక సహకారం అందిస్తోంది. విదేశాల్లోనే ఉండిపోయిన బాధితురాళ్లకు అండగా అక్కడి దౌత్యకార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

పిల్లల్ని ఎత్తుకెళ్లారంటూ తల్లులపై ఫిర్యాదులు..

విదేశాల్లో భర్తల వేధింపులు తట్టుకోలేక పిల్లలతో వచ్చేస్తున్న యువతులు ఇక్కడ గృహహింస కేసులు పెడుతున్నారు. అయితే విదేశాల్లో పుట్టిన పిల్లలకు సహజంగానే ఆయా దేశాల పౌరసత్వం వస్తుండటంతో పిల్లల్ని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారంటూ భర్తలు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుల ఇబ్బందుల్ని ఆయా దేశాల దౌత్యవర్గాల దృష్టికి తీసుకెళ్లడంలో మహిళా భద్రత విభాగం కీలకంగా వ్యవహరిస్తోంది. అలాగే విదేశాల్లోనే ఉన్న బాధితులకు న్యాయసహాయం అందించే విషయంలో సహకరించడం.. ఇక్కడి నుంచి బాధితురాళ్లు విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన వీసాలు ఇప్పించడం.. తల్లుల సంరక్షణలో ఇక్కడ ఉన్న విదేశీ పౌరసత్వం కలిగిన పిల్లల సమస్యలను దౌత్యవర్గాలకు వివరించడం.. లాంటి అంశాలపై దృష్టి సారించింది.

గృహహింస కేసుల్లో ఉమ్మడి కార్యాచరణ

గృహహింసకు పాల్పడి తిరిగి కిడ్నాప్‌ కేసులు పెడుతున్న ఉదంతాలు ఒక్క అమెరికాలోనే ఇటీవలికాలంలో ఆరు నమోదయ్యాయని మహిళా భద్రత విభాగం డీఐజీ సుమతి తెలిపారు. ఆ కేసుల్లో బాధితుల పూర్వాపరాల గురించి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ అధికారులకు వివరించామన్నారు. కెనడాలోని దౌత్యవర్గాలూ సానుకూలంగా స్పందించాయని తెలిపారు. ఇలాంటి కేసుల్లో ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Ganjai at shadnagar: గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం​.. పలు చోట్ల అరెస్టులు

ABOUT THE AUTHOR

...view details