Jubilee Hills Gang Rape Case: రాష్ట్రంలో నిత్యం మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మెట్టా డిసౌజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు నిరసనగా హైదరాబాద్ గాంధీ భవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా కాంగ్రెస్ మౌన దీక్షకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ మంత్రి కొండా సురేఖ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితారావు పాల్గొన్నారు. అన్ని జిల్లాల నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నేతలు తరలివచ్చారు. 'కేసీఆర్ పాలనలో పూటకో అత్యాచారం... రోజుకో హత్య' పేరిట ఆందోళన చేపట్టారు. నోటికి నల్ల రిబ్బన్ ధరించి మౌనదీక్ష చేపట్టారు. అనంతరం డిసౌజా మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో మహిళలు, ఆడపిల్లలకు భద్రత లేకుండా పోయింది. ప్రతి రోజూ ఆరుగురు చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతలు దెబ్బతింటుంటే ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. జూబ్లీహిల్స్ ఉదంతంలో హోం మంత్రి మనవడు, ఎమ్మెల్యే కుమారుడు నిందితులుగా ఉన్నా.. స్పందించడానికి ముఖ్యమంత్రి, మంత్రివర్గానికి సమయం దొరకడం లేదు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు తరహాలో మరొకరు వీడియోలు బయటపెడితే అప్పుడు హోం మంత్రి మనవడ్ని ఏ-7గా చేరుస్తారా.? -మెట్టా డిసౌజా, జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
అంతకుముందుగా మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనను సీబీఐకి అప్పగించాలని కోరుతూ.. మహిళా కాంగ్రెస్ నేతల బృందం డీజీపీ మహేందర్ రెడ్డిని.. ఆయన కార్యాలయంలో కలిశారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉదంతంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించాలని మెట్టా డిసౌజ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆక్షేపించారు. రాజధాని నడిబొడ్డున దారుణ ఘటన జరిగినప్పుడు స్పందించకుండా మహిళా మంత్రులు, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడు సీఎం కార్యాలయం నుంచి మెసేజ్ కూడా రాలేదని మండిపడ్డారు. రాష్ట్ర హోం మంత్రి డమ్మీ హోం మంత్రిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు మహిళా మంత్రులు ఎందుకు స్పందించడంలేదని మండిపడ్డారు.