నేడు రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఒకట్రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదే విధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో వివరించింది.
విదర్భ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ద్రోణి బలహీనపడిందని పేర్కొన్నారు. ఝార్ఖాండ్ నుంచి చత్తీస్‌గడ్ విదర్భ మీదుగా ఉత్తర మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి సముద్రమట్టానికి 3.1కి.మీ నుంచి 4.5కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఉపరితల ఆవర్తనం విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 4.5కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని వెల్లడించారు.
నిన్న కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురిశాయి. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వాన నీటితో పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డికాపుల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం వల్ల వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.