తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లో కనీస మౌలిక వసతులు కల్పించడమేగాక వాటి రూపురేఖలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకొంది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యాచరణ అమలు చేస్తోంది. ఇప్పటివరకు రెండు దఫాలుగా రాష్ట్రంలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమలు చేశారు.
రెండు దఫాలుగా పల్లెప్రగతి కార్యక్రమం అమలు
- పల్లెప్రగతి మొదటి దశలో నెలరోజుల పాటు, ఆ తర్వాత పది రోజులపాటు రాష్ట్రంలోని 12 వేల 751 గ్రామాల్లో పల్లెప్రగతి కింద వివిధ పనులు చేపట్టారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి దిశగా కార్యాచరణ రూపొందించి పనులు చేపట్టారు. ఆర్థికసంఘం నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ప్రతినెలా 339 కోట్ల చొప్పున ఇప్పటివరకు 1814కోట్ల రూపాయలను విడుదల చేశారు.
- పల్లెప్రగతి రెండోదశ సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్‌గా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు గ్రామాల్లో తనిఖీలు చేసి పనుల పురోగతి పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో పనులు చేసిన గ్రామాల్లో పనులు బాగా జరిగాయని గమనించారు. పల్లెప్రగతి స్ఫూర్తిని నిరంతరంగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు
పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లోని రహదార్లు, మురుగు కాల్వలను శుభ్రం చేశారు. రాష్ట్రంలో గుర్తించిన 10 వేల 867 పాతబావులు, బోర్లలో.. 9 వేల 938 పాతబావులు, బోర్లను పూడ్చివేశారు. 12 వేల 748 గ్రామపంచాయతీల్లో జరిగిన శ్రమదాన కార్యక్రమంలో ఎనిమిది లక్షలకుపైగా మంది పాల్గొన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలను 70 శాతానికిపైగా పరిష్కరించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 లక్షలకుపైగా వీధి దీపాలకుగాను 97 శాతం అంటే 16 లక్షలా 64 వేలకుపైగా దీపాలు వెలుగుతున్నట్లు జిల్లా అధికారులు నివేదించారు.
ప్రభుత్వ ప్రణాళిక - సాధించిన ఫలితాలు
- పల్లెప్రగతికి 15 కోట్లా 88 లక్షల రూపాయలను విరాళంగా అందించారు.
- సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రెండు కోట్ల రూపాయలకుపైగా విరాళాలు రాగా.. మేడ్చల్ - మల్కాజిగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కోటీ 90లక్షలకు పైగా విరాళాలు అందాయి.
- రాష్ట్రంలోని 11 వేల 548 పంచాయతీల్లోని నర్సరీల్లో కొత్తగా 13 కోట్లకుపైగా మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు.
- మొత్తం 12 వేల 751 గ్రామపంచాయతీలకుగాను 4 వేల 361 పంచాయతీల్లో వైకుంఠధామాలు ఉన్నాయి. 6 వేల 489 చోట్ల వైకుంఠధామాల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. అందులో 131 చోట్ల నిర్మాణం పూర్తైంది.
- గ్రామాల్లో ఇప్పటి వరకు 6,996 చోట్ల డంప్ యార్డులుండగా... 2,258 చోట్ల వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి.