కరోనా వల్ల చిన్నాభిన్నమైన విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం విద్యారంగంపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించి.. అనుసరించాలని తెలంగాణ యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆఫీసు బేరర్ల ఆన్లైన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాల్గొన్నారు. కరోనా వల్ల విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభించలేదని, ఆన్లైన్ క్లాసులకు అనుమతించలేదని విద్యాశాఖ హైకోర్టుకు తెలిపింది. కానీ కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తెలిపారు. కొన్ని సొసైటీల గురుకుల విద్యాసంస్థలు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ పిల్లలు క్లాసులు వినేటట్లు చూడాలని అధికారులు ఉపాధ్యాయులను ఒత్తిడి చేస్తున్నారన్నారు. స్మార్ట్ ఫోన్లు లేకపోతే బంధువులు, పక్కింటి వారి స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్లైన్ క్లాసులు వినాలని, లేదంటే.. హాజరు వేయమని, ఫెయిల్ చేస్తామని విద్యార్థులను బెదిరిస్తున్నారని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే.జంగయ్య, చావ రవి ఆరోపించారు.
విద్యారంగంపై స్పష్టమైన విధానాలకై యూటీఎఫ్ డిమాండ్ - ts utf
విద్యారంగంపై ప్రభుత్వం స్పష్టమైన విధానాలను అనుసరించాలని యుటిఎఫ్ డిమాండ్ చేసింది. కరోనా విజృంభన నేపథ్యంలో రాష్ట్ర విద్యారంగంలో నెలకొన్న గందరగోళాన్ని నివారించేందుకు విద్యాశాఖ నిర్ధిష్టమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
సోషల్ వెల్ఫేర్ సొసైటీ గ్రామీణ అభ్యసన కేంద్రాలు(విఎల్సీ) ఏర్పాటు చేసి ఒక్కో గ్రామంలో 5 నుండి 10 మంది విద్యార్థులను ఒక దగ్గర చేర్చి పైతరగతుల విద్యార్థుల చేత తరగతులు బోధిస్తున్నారని తెలిపారు. ఒక్కొక్క టీచర్‌కు ఐదు కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారని, మోడల్ స్కూల్స్‌లో కూడా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి పాఠాలు చెప్తున్నారని ఆరోపించారు. కాగా విద్యా శాఖ ఆజమాయిషీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నదని వారు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన విద్యాశాఖ సమీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాలని ఆదేశించినందున అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. మధ్యాహ్న భోజనం కోసం పాఠశాలల్లో నిల్వ ఉంచిన బియ్యం పాఠశాలలు తెరిచేనాటికి పాడయ్యే అవకాశం ఉన్నందున వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలని, మధ్యాహ్న భోజనం వర్కర్లకు గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసింది.
ఇదీ చూడండి:35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్