TSPSC Muttadi: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఆందోళనకు దిగింది. గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరుతూ... ర్యాలీగా వచ్చిన నిరుద్యోగ ఐకాస నాయకులు, నిరుద్యోగులు.. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఎన్నికలొస్తేనే ఉద్యోగాలు
11 ఏళ్లుగా గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయలేదని... ఈ విషయం గమనిస్తేనే ఎంతమంది నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారో స్పష్టంగా తెలుస్తుందని ఐకాస ఛైర్మన్ నీల వెంకటేశ్ పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించక పోవడం దారుణమన్నారు. త్వరలో ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామంటూ ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి హామీలిస్తూ.. పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లుగా అప్పులు చేస్తూ సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు ఎందరో ఉన్నారని.. వారికి సీఎం తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా, మండల స్థాయి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.