డిజిటల్ తెలంగాణలో భాగంగా రవాణా శాఖ ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. డూప్లికేట్ లెర్నింగ్ లైసెన్స్, డూప్లికేట్ లైసెన్స్, బాడ్జ్‌లు అందజేయడం, డ్రైవింగ్ లైసెన్స్ హిస్టరీ షీట్, పాత కార్డ్ స్థానంలో కొత్త స్మార్ట్ కార్డ్‌లు ఇవ్వడం వంటి ఐదు రకాల సేవలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రస్తుతం ఐదు సేవల్ని ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నామని... మరో 6 సేవలను మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే ఈ సేవలను మొబైల్లో పొందవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సంస్కరణలు వచ్చాయన్న మంత్రి పువ్వాడ... కేటీఆర్ జన్మదినం సందర్భంగా దేశంలోనే తొలిసారిగా రవాణశాఖలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు.
అందుబాటులోకి ఐదు ఆన్‌లైన్ రవాణా సేవలు - హైదరాాబాద్ వార్తలు
ప్రజలకు చేరువయ్యేలా మరిన్ని ఆన్‌లైన్ సేవలను రాష్ట్ర రవాణా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫెస్ట్ పేరుతో హైదరాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ సేవలను ప్రారంభించారు. వీటి ద్వారా ఐదు రకాల ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల సమయం వృథా కాకుండా... పారదర్శకత కోసం ఈ విధానం తీసుకొచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఎం-గవర్నెన్స్, టి-యాప్ ఫోలియో ద్వారా ఫెస్ట్ సేవలు
ఎం-గవర్నెన్స్, టి-యాప్ ఫోలియో ద్వారా ఈ ఫెస్ట్ సేవలు పనిచేస్తాయి. ఇందులో పౌరుడి పేరు, తండ్రి పేరు, చిరునామా, డీఎల్ఎల్ నంబర్ నమోదు చేయటంతోపాటు, సెల్ఫీ దిగి... అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉటుంది. అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఇది పని చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో లైవ్‌నెస్ చెక్ వల్ల సెల్ఫీ ఫోటోలను ఇది పరీక్షిస్తుంది. ఇదే... ఇందులో అతి ముఖ్యమైన పరీక్ష. ఆ తర్వాత దరఖాస్తుదారుడి పేర్లలో ఉన్న స్వల్ప తేడాలు, వ్యత్యాసాలు తనిఖీ చేస్తోంది. డీప్ లెర్నింగ్ బేస్ట్ ఇమేజ్‌తో ఫొటోలో ఉన్న వైవిద్యాలను ఈ సాంకేతికత పరిజ్ఞానంతో పరిశీలిస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. వినియోగదారుడి వాహనం భౌతిక తనిఖీ పరీక్షలు మినహా... మిగిలిన సేవలన్ని వినియోగదారులకు ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు రవాణాశాఖ కృషి చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.