ప్రజా భద్రత చట్టానికి అనుగుణంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడంపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వపరంగా ప్రధాన కూడళ్లలోనివే కాక కాలనీలు, నివాస సముదాయాల్లోనూ వీటిని బిగించేలా ప్రజల్ని చైతన్యపరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు దిశగా ముమ్మర యత్నాలు సాగిస్తోంది. ఏడాది క్రితం వరకు దేశవ్యాప్తంగా ఏర్పాటైన సీసీ కెమెరాల్లో ఒక్క తెలంగాణలోనే దాదాపు 65శాతం ఉండటం ఇందుకు నిలువెత్తు నిదర్శనం. పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ(బీపీఆర్‌డీ) ఇటీవల విడుదల చేసిన ‘డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్’ నివేదిక ఇదే విషయాన్ని వెల్లడించింది. 2019 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్ సంస్థలకు సంబంధించిన వివరాల్ని ఈ నివేదికలో పొందుపరిచారు.
2019 జనవరి 1 నాటికి ఇదీ లెక్క..
- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 4,27,529 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు.
- వాటిలో ఒక్క తెలంగాణలోనే 2,75,528 కెమెరాలు బిగించడం విశేషం. మొత్తం కెమెరాల్లో ఇది దాదాపు 65శాతం.
- రెండో స్థానంలో నిలిచిన తమిళనాడులో వీటి సంఖ్య 40,112 మాత్రమే. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(39,587), మధ్యప్రదేశ్(21,206) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 14,770 సీసీ కెమెరాలున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో వీటి సంఖ్య పదివేల లోపే.
- 19 రాష్ట్రాల్లో కేవలం వెయ్యి వంతునా లేవు. ఆరు రాష్ట్రాల్లో వంద లోపు ఉండగా.. లక్షద్వీప్, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌ల్లో వీటి సంఖ్య సున్నా.
కమిషనరేట్లలోనూ ఘనమే..