ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ జరుపుతున్న విచారణ వల్ల ప్రయోజనం ఉండదని తెలంగాణ భావిస్తోంది. అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం ఏర్పాటయ్యే ట్రైబ్యునల్‌తోనే ఫలితం ఉంటుందనే అభిప్రాయంతో ఉన్న రాష్ట్రం దీనికోసం ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు తాజాగా రాసిన లేఖలో కూడా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
- 2004లో ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణాజల వివాద ట్రైబ్యునల్-2 సుమారు దశాబ్దం పాటు విచారించి 2013లో తుది తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ తీర్పు గెజిట్ నోటిఫికేషన్ జరగలేదు.
- 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కచ్చితమైన కేటాయింపులు, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు నిర్వహణకు సంబంధించిన ప్రొటోకాల్‌ను ఖరారు చేసే పనిని బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు కేంద్రం అప్పగించింది. ఈ ట్రైబ్యునల్ పరిధి పరిమితం కాబట్టి అంతర్ రాష్ట్ర జలవివాద చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలి లేదా బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కే సెక్షన్ 3 ప్రకారం ఈ బాధ్యత అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం 2014 జులై 14న కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఏడాది పాటు మనుగడలో ఉంది. ఏడాది తర్వాత ఉన్న ట్రైబ్యునల్‌కే వెళ్లి చెప్పుకోమని కేంద్రం సూచించింది. అంటే సెక్షన్-89 ప్రకారమే జరిగే విచారణలోనే వాదన చెప్పుకోమంది.
- ఇదే సమయంలో బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ గడువు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాదనలు వినడానికేనని 2016 అక్టోబరులో ట్రైబ్యునల్ స్పష్టం చేయడంతో పాటు పునర్విభజన చట్టంలోని సెక్షన్-89లో పేర్కొన్న అంశాలకే పరిమితమైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటికే కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 , అంతర్ రాష్ట్ర జలవివాద చట్టం-1956లోని సెక్షన్-2 ప్రకారం ఇచ్చిన మధ్యంతర తీర్పుపైన, సెక్షన్-3 ప్రకారం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రాలు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లు ఐదు ఉండగా, ఈ పిటిషన్‌ను కూడా వాటికే జత చేసి సుప్రీం విచారణ జరుపుతోంది.
- బచావత్ ట్రైబ్యునల్ చేసిన కేటాయింపుల్లో మార్పులు లేకుండానే 65 శాతం నీటి లభ్యత, సరాసరి నీటి లభ్యత కింద అదనంగా వచ్చిన నీటిని రాష్ట్రాలకు బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ పంపిణీ చేసింది. తెలంగాణలోని జూరాలకు అదనంగా తొమ్మిది టీఎంసీలు, రాయలసీమలోని తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు నాలుగు టీఎంసీలు కేటాయించింది. ప్రస్తుతం సెక్షన్-89 ప్రకారం జరుగుతున్న విచారణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కున్న 811 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు నిర్ణయమవుతాయి. బచావత్ ట్రైబ్యునల్ రాష్ట్రం మొత్తంగా(ఎన్‌బ్లాక్) కేటాయించినప్పటికీ ప్రాజెక్టు వారీగా ఆయకట్టు, నీటి వినియోగం ఉంది. సీతారామ ఎత్తిపోతల ద్వారా నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద కొంత ఆయకట్టు సాగవుతుంది.
- ఆంధ్రలో గోదావరి-పెన్నా కింద సాగర్ కుడికాలువ ఆయకట్టులో కొంతభాగానికి నీరందుతుంది. పోలవరం ద్వారా కృష్ణాడెల్టాకు మళ్లించే 80 టీఎంసీలలో 45 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి.సెక్షన్-3 ప్రకారం ట్రైబ్యునల్ విచారణ చేస్తే ఇలా ఆదా అయ్యే నీటిని కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు ప్రత్యేకించి శ్రీశైలం ఆధారంగా మిగులు జలాలతో చేపట్టిన ప్రాజెక్టులకు ప్రయోజనం కలుగుతుంది. బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. అందుకే సెక్షన్-3 కింద విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నట్లు సమాచారం.
- కేంద్రం అంతర్‌రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్-3 ప్రకారం విచారణ చేయమని చెప్పలేదు కాబట్టి ట్రైబ్యునల్ పరిధి పరిమితమైందని, దీనివల్ల తమకు అన్యాయం జరిగిందని సీఎం తాజాగా రాసిన లేఖలో కూడా పేర్కొన్నారు. అప్పుడే కేంద్రం సానుకూలంగా స్పందించి ఉంటే సమస్య పరిష్కారమై ఉండేదని కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సానుకూలంగా లేదని తెలుస్తోంది. గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించడం వల్ల ఆదా అయ్యే నీటి పంపిణీ అనగానే మహారాష్ట్ర, కర్ణాటకలు కూడా రంగంలోకి వస్తాయని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కు పెద్దగా ప్రయోజనం ఉండదని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక రాష్ట్రం ఫిర్యాదు చేసినా కేంద్రం సెక్షన్-3 ప్రకారం విచారించడానికి అవకాశం ఉందని, ఏమీ పట్టించుకోకుండా ఉన్న కేంద్రంపై ప్రభుత్వం మరింత ఒత్తిడి తేనుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి.