TS TET Notification 2023 : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి ఈ నెల 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబరు 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అదే నెల 27న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. పూర్తి వివరాల కోసం tstet.cgg.gov.inలో చూడాలని అధికారులు తెలిపారు.
Telangana TET Notification 2023 :ఇటీవలే ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్ మరోసారి నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు.. సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ భేటీ అయ్యారు. ఉపాధ్యాయ నియామకాలు, మన ఊరు మన బడిపై చర్చించారు. టెట్ నిర్వహణకు కసరత్తు చేయాలని విద్యాశాఖకు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
రేపటి నుంచి ఈనెల 16వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టెట్ ఛైర్‌పర్సన్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన వెల్లడించారు. హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో సెప్టెంబరు 9 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. సెప్టెంబరు 15న ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ వన్.. మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ టూ పరీక్ష జరగనుంది. సెప్టెంబరు 27న ఫలితాలు ప్రకటించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గత టెట్‌తో పోలిస్తే పరీక్ష ఫీజు వంద రూపాయలు పెంచి.. ఒక పేపర్ లేదా రెండు పేపర్లు రాసినా 400 రూపాయలుగా నిర్ణయించారు. రాష్ట్రంలో సుమారు 13,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర సర్కార్ సంవత్సరం క్రితమే ప్రకటించింది.