Telangana temperature rises : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాల్లోనూ గరిష్ఠంగా 30 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. సహజంగా మార్చి 1 నుంచి వేసవి కాలంగా పరిగణిస్తారు. అయితే ఈసారి కాస్త ముందుగానే వేసవికాలం ప్రారంభం కానున్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటివరకు దాదాపు 28 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండగా... ఆదివారం నాడు ఒక్కసారిగా 34.4 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది.
ఈ ఏడాదిలో విస్తారమైన వర్షాలు కురిశాయి. తర్వాత రాష్ట్రాన్ని మంచుదుప్పటి కప్పేసింది. అనంతరం త్వరలో వేడిగాలులు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో కనీసం రెండు నుంచి మూడు డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా వెల్లడిస్తోంది. హైదరాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సగటున 19 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగాయి. అధికారిక నివేదిక రానప్పటికీ... ఈ సంవత్సరం వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని సమాచారం. రాబోయే మూడు నాలుగు రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని... ఉష్ణోగ్రతల సగటు గరిష్ఠంగా 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠంగా 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.