Kasani Gnaneshwar fire on Niranjan Reddy: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఖండించారు. నాడు ఎన్టీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చంద్రబాబు నాయుడు మాట్లాడితే బీఆర్ఎస్ ఉలిక్కిపడుతోందని అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆనాడు ఏం జరిగిందన్న విషయమే చంద్రబాబు ప్రస్తావించారు తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు.
"ఆనాడు జొన్న, సజ్జ, మొక్కజొన్న, తైదలు, బొట్టు, నల్ల వడ్లు మాత్రమే పండేవని.. కిలో రూ.2 బియ్యం పథకం ప్రవేశపెట్టిన తర్వాత బీదలు, బడుగు వర్గాలకు వరి అన్నం దొరికిందని" కాసాని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఆ పథకం వల్ల ఆకలి రాజ్యం పోయిందన్న విషయం పెద్దలంతా గమనించాలని హితవు పలికారు. "వాస్తవ రూపంలోకి వచ్చి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడాలని సూచించిన ఆయన.. దొర ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదని" ఆక్షేపించారు.
నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన జ్ఞానేశ్వర్.. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు హయంలో జరిగిన అభివృద్ధికి నేడు కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధికి చర్చకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ప్రకటించగానే బీఆర్ఎస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు. నిరంజన్ రెడ్డి సొంత ప్రాంతం నుంచి ఇంకా వలసలు సాగుతున్నాయని తెలిపారు. "దమ్ బిర్యానీ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో నిరంజన్ రెడ్డికి తెలుసా..? గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? నిరుద్యోగ భృతి ఏమైంది..? అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ''ఇంటింటికీ తెలుగుదేశం'' ప్రచార కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రచార కిట్లను పార్టీ శ్రేణులకు అందజేసి వారికి తగు సూచనలు చేశారు.