తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Tax Revenue: పన్ను రాబడిలో గణనీయ పెరుగుదల.. ఈ ఏడాది రూ.856 కోట్ల లక్ష్యం! - తెలంగాణలో పన్నుల రాబడులు

Telangana Tax Revenue 2020-2021: రాష్ట్రంలో పన్నుల రాబడులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది రూ.532 కోట్ల డిమాండ్‌ ఉండగా.. ఈ ఏడాది రూ.627 కోట్లకు చేరుకుంది. కొత్తగా పన్ను పరిధిలోకి 70 వేలకు పైగా ఆస్తులు రానున్న నేపథ్యంలో.. 2021-22 పన్ను రాబడి లక్ష్యం రూ.856 కోట్లుగా పురపాలక శాఖ నిర్దేశించింది.

Telangana Tax Revenue
పన్ను రాబడి

By

Published : Dec 11, 2021, 10:16 AM IST

Telangana Tax Revenue 2020-2021: కొత్త పన్నుల భారం మోపకుండానే రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు రాబడులు గణనీయంగా పెరిగాయి. ఆస్తి పన్నును వాస్తవ విలువ ఆధారంగా మదించడంతో పాటు ఎగవేతకు అడ్డుకట్ట వేయడం, చెల్లింపునకు సులువైన విధానాలను అందుబాటులోకి తీసుకురావడం సత్ఫలితాలనిస్తోంది. పురపాలక శాఖకు ఈ ఏడాది ఆస్తిపన్ను ఆదాయం రూ.100 కోట్ల మేర పెరగనుంది. గత ఏడాది రూ.532 కోట్ల డిమాండ్‌ ఉండగా.. ఈ ఏడాది రూ.627 కోట్లకు చేరుకుంది. గతంలో పన్ను పరిధిలోకి రాని ఆస్తులను గుర్తించడం ద్వారా మరో రూ.148 కోట్లు వసూలు కానుంది. జీహెచ్‌ఎంసీ కాకుండా రాష్ట్రంలోని మిగిలిన నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో 2021-22 సంవత్సరంలో రూ.856 కోట్ల ఆస్తి పన్ను వసూలు లక్ష్యాన్ని పురపాలక నిర్దేశించింది.

ఆస్తుల జియోట్యాగింగ్‌

పురపాలకశాఖ డైరెక్టర్‌ పరిధిలోని 128 పురపాలక సంఘాలు, 12 నగరపాలక సంస్థల పరిధిలో ఖాళీ స్థలాలపై పన్ను విధించడం, పట్టణాలు, నగరాల్లోని అన్ని ఆస్తులను పన్ను పరిధిలోకి తీసుకురావడంతో అదనపు రాబడి రావడానికి మార్గం సుగమమైంది. ‘భువన్‌-2’ కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాల్లోని అన్ని ఆస్తులను జియోట్యాగింగ్‌ చేశారు. మొత్తం 13.25 లక్షల ఆస్తుల మ్యాపింగ్‌ పూర్తి కాగా.. ఈ ఏడాది సుమారు 70 వేలకు పైగా ఆస్తులు కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చాయి.

చెల్లింపులకు సులభ విధానాలు

  • ప్రతి ఆస్తికి క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా డిమాండ్‌ నోటీసులు ఇవ్వడంతో పాటు దాని సాయంతో ఆన్‌లైన్‌లో నేరుగా పన్ను చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
  • వాట్సప్‌ ద్వారా, ఆన్‌లైన్‌లో డెబిట్‌/క్రెడిట్‌ కార్డులతో పాటు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ ద్వారా కూడా చెల్లింపులకు అవకాశం కల్పించారు.
  • ప్రతి సోమ, బుధవారాల్లో పన్ను వివాద పరిష్కార మేళాలు నిర్వహిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులను నియమించారు.

ఇదీ చూడండి:'అధికారులు రూ.లక్షల్లో ఖర్చుపెట్టించారు.. ఇప్పుడు సంబంధం లేదంటున్నారు'

ABOUT THE AUTHOR

...view details