తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను గాలికి వదిలేసినందుకు నిరసనగా తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాల వద్ద ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించాలని హస్తం పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. నాయకులు అందరూ ఒకచోట కాకుండా వారి వారి ప్రాంతాల్లోని జలాశయాల వద్ద దీక్షలో పాల్గొంటారు.
ఎస్ఎల్బీసీ వద్ద పీసీసీ అధ్యక్షుడు ఉత్మమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దీక్ష చేయనుండగా.. పాలేరు జలాశయం వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సీతక్క, పొడెం వీరయ్య దీక్ష చేపట్టనున్నారు. అలాగే పరిగి లక్ష్మీదేవిపల్లి పంప్‌హౌజ్ వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పాల్గొనున్నారు. ఎల్లూరు జలాశయం వద్ద మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, కరివెన వద్ద మాజీ మంత్రి చిన్నారెడ్డి, నెట్టెంపాడు వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి దీక్ష చేయనున్నారు.