Telangana State Statistical Report 2022: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరాకృతి, రీ ఇంజినీరింగ్‌తో అనేక ప్రాజెక్టులు విజయవంతమయ్యాయని రాష్ట్ర గణాంక నివేదిక-2022 పేర్కొంది. నివేదికలోని అంశాలను శనివారం సమాచారశాఖ విడుదల చేసింది. ‘2014లో రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం 62.48 లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా 2022 నాటికి ఒక కోటి 35 లక్షల 60 వేల ఎకరాలకు పెరిగింది. 24 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో 69.02 లక్షల ఎకరాల ఆయకట్టు కొనసాగుతోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆ ప్రాజెక్టుల కింద కొత్తగా 19.48 లక్షల ఎకరాలకు నీటిపారుదల సామర్థ్యం పెరిగింది.
మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్నతరహా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు నీటిసరఫరా పెరిగింది. పెరిగిన సాగునీటి విస్తరణ కారణంగా 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి ఉండగా 2022 నాటికి 2.49 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. దీంతో దేశంలో వరి ఉత్పత్తిలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. దేశ నీటిపారుదల చరిత్రలో తెలంగాణ సాగునీటి రంగం సరికొత్త అధ్యాయంగా నిలుస్తోంది’ అని పేర్కొంది.