Medchal DCP visit Etala : ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందని.. హత్యకు కుట పన్నుతున్నారంటూ ఈటల రాజేందర్ భార్య జమున చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం భద్రత కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు.. మేడ్చల్ డీసీపీ సందీప్‌రావు ఈటలను కలిశారు.
ఈ రోజు ఉదయం భద్రత అంశంపై ఈటల స్వగృహంలో.. డీసీపీ సందీప్‌రావు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన హత్యకు కుట్ర జరుగుతోందనీ.. తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే ఈటల రాజేందర్ తెలపడం జరిగింది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రత కల్పిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఈటల రాజేందర్ మేడ్చల్ డీసీపీతో చర్చించిన అనంతరం.. నియోజకవర్గంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థని అడిగి తెలుసుకోమని సూచించారు.. కరీంనగర్ సీపీ దగ్గర సమగ్ర సమాచారం తెలుసుకోమని తెలిపారు. అక్కడి సమాచారం మీద ఆధారపడి భద్రతపై నిర్ణయాలు తీసుకోమని పేర్కొన్నారు. నిజ నిజాలను తెలుసుకున్న తర్వాతే భద్రతపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Y కేటగిరీ భద్రతకు కేంద్రం నిర్ణయం:మరోవైపుఈటల రాజేందర్‌కు కేంద్ర ప్రభుత్వం Y కేటగిరీ భద్రత కల్పించాలనే యోచనలో ఉంది.బీజేపీ ముఖ్య నాయకుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలను హతమార్చేందుకు కౌశిక్ రెడ్డి రూ.20 కోట్ల సుపారీ ఇచ్చినట్లు తమకు తెలిసిందని జమున ఆరోపించారు.