రాష్ట్రానికి మరిన్ని కొవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్... కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అన్ని రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ మంత్రులతో కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో అధికారులతో కలిసి మంత్రి ఈటల పాల్గొన్నారు. రాష్ట్రంలో 140 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని మంత్రి తెలిపారు.
అన్ని కేంద్రాల్లో సాఫ్ట్వేర్ పనిచేయడం లేదని, ఉన్న సమస్యలను పరిష్కరించి సరళతరం చేయాలని సూచించారు. ముందుగా హెల్త్వర్కర్స్కు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధానమంత్రి నిర్ణయించారని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోరా...? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారన్న ఆయన... 50 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేసేటప్పుడు తానూ వేసుకుంటానని అన్నారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతానికి అందరి సహకారం అవసరమని, దేశమంతా సమష్టిగా పనిచేసి పోలియోను పారద్రోలినట్లే కరోనాను కూడా లేకుండా చేద్దామని కేంద్రమంత్రి అన్నారు.