Foreign Industrial Parks : విదేశీ సంస్థలను ఆకట్టుకునేందుకు, భారీగా పెట్టుబడులను సమీకరించేందుకు ఆయా దేశాల పేరిట ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి భూములు కేటాయించడంతో పాటు రాయితీలు, ప్రోత్సాహకాలు, మానవ వనరులను అందించాలని, శిక్షణ కేంద్రాలను స్థాపించాలని భావిస్తోంది. తొలి దశలో 10 దేశాలకు చెందిన పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఫ్రాన్స్, కొరియా, తైవాన్, జపాన్, జర్మనీ, కెనడా, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, ఇండోనేసియాలు ఈ జాబితాలో ఉన్నాయి.
విదేశాల పేరిట ప్రత్యేక పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించడం దేశంలో ఇదే ప్రథమం. రాష్ట్రంలో గత 8 ఏళ్లలో 156 పారిశ్రామిక పార్కులు ఏర్పాటయ్యాయి. నాలుగేళ్ల నుంచి ఏరోస్పేస్, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ తదితర రంగాల వారీగా నెలకొల్పుతున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పలు దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పారిశ్రామికవేత్తలు ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణకు వచ్చిన విదేశీ పారిశ్రామిక ప్రతినిధుల బృందాలూ ఇదే కోరుతున్నాయి. తాజాగా తైవాన్ ప్రతినిధుల బృందంతోనూ చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకొచ్చింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విదేశీ ప్రత్యేక పారిశ్రామిక పార్కుల స్థాపనకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దేశాల వారీగా ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. దీనికి అనుగుణంగా పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సంస్థల ఆసక్తి, సన్నద్ధత, రంగాల వారీగా పెట్టుబడుల అంచనాను బట్టి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది దేశాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. తాజాగా తైవాన్‌ను ఈ జాబితాలో చేర్చారు.