తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయించాలి' - State letters to Center on irrigation issues

TS Government Letters to the Center: పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై తటస్థ సంస్థతో సమగ్ర అధ్యయనం చేయించాలని కేంద్రాన్ని మరోసారి రాష్ట్రప్రభుత్వం కోరింది. తమ అభ్యంతరాలపై తక్షణమే జోక్యం చేసుకుని రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. తాము లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా.. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం పనులను కొనసాగిస్తున్నారని కేంద్రానికి రాసిన లేఖలో ప్రభుత్వం పేర్కొంది. కాళేశ్వరం అదనపు టీఎంసీలు పనుల అనుమతుల ప్రక్రియను గోదావరి బోర్డు ఆలస్యం చేయడం సరికాదని అభిప్రాయపడింది. కర్ణాటకలోని అప్పర్‌ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టుల అనుమతులను వెంటనే నిలిపివేయాలని కేంద్ర జలవనరులశాఖను కోరింది.

TELANGANA STATE GOVERNMENT LETTERS TO THE CENTER
TELANGANA STATE GOVERNMENT LETTERS TO THE CENTER

By

Published : Sep 23, 2022, 9:31 AM IST

పోలవరం సహా నీటిపారుదల అంశాలపై కేంద్రానికి ప్రభుత్వం లేఖలు

TS Government Letters to the Center: పోలవరం ప్రాజెక్టు సహా ఇతర నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్.. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్‌కు మూడు లేఖలు రాశారు. పోలవరానికి సంబంధించి తాము లేవనెత్తిన కీలకాంశాలను పరిగణలోకి తీసుకోకుండా పనులు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.

ముంపు నష్టాన్ని మళ్లీ అంచనావేయాలి:పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావం రాష్ట్రంలో గోదావరికి రెండు వైపులా ఉంటుందని.. స్టేక్ హోల్డర్స్ అందరితోనూ చర్చించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని రజత్‌కుమార్ గుర్తు చేశారు. ప్రాజెక్టు స్పిల్ వేను 50 లక్షల క్యూసెక్కుల నీటికి అనుగుణంగా డిజైన్ చేశారని అదే జరిగితే తెలంగాణలో ముంపు ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రాజెక్టు స్పిల్ వే డిశ్చార్జ్ కర్వ్స్, ఛానల్, ఫ్లడ్ రూటింగ్‌కు సంబంధించిన వివరాలు అందించాలని కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరారు.

పోలవరం వల్ల భద్రాచలంతోపాటు పరిసర గ్రామాలు, మణుగూరు భారజల కర్మాగారం, భద్రాద్రి థర్మల్ ప్లాంటు ముంపునకు గురయ్యే ప్రమాదముందని పేర్కొన్నారు. బ్యాక్‌వాటర్స్ అధ్యయనం ద్వారా ప్రాబబుల్ మ్యాక్జిమమ్ ఫ్లడ్‌ను సరిగ్గా అంచనా వేయాల్సిన అవసరముందన్నారు. నదికి సంబంధించిన క్రాస్ సెక్షన్స్ విషయంలోనూ సర్వే చేయాలని కోరారు.

పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావం: పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావం గోదావరి నదితోపాటు సమీపంలోని వాగులపై పడుతుందని తెలిపారు. తద్వారా పంట పొలాలు, ఎత్తిపోతల పథకాలు ముంపునకు గురవుతాయన్న ప్రభుత్వం.. ఎన్జీటీ తీర్పునకు అనుగుణంగా భద్రాద్రి జిల్లాలో రక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరింది.

అనుమతుల్లేకుండా బేసిన్ వెలుపల నిర్మిస్తున్న ఏపీ ఎత్తిపోతల పథకాల కోసం... పోలవరంలో ఎక్కువకాలం ఎఫ్​ఆర్​ఎల్​ కొనసాగించాల్సి వస్తుందని.. తద్వారా ముంపు పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా నిర్మాణాలను తక్షణమే ఆపివేయాలని రజత్‌కుమార్‌ లేఖ ద్వారా కోరారు. పోలవరంలో 150 అడుగుల ఎఫ్​ఆర్​ఎల్​ను కొనసాగిస్తే భద్రాచలంపై ముంపు ప్రభావం ఏటా ఉంటుందని పేర్కొన్నారు.

తమ ఆందోళన, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని కేంద్రం తక్షణమే జోక్యం చేసుకొని రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. పోలవరం బ్యాక్ వాటర్స్ ప్రభావంపై తటస్థ సంస్థతో సమగ్ర అధ్యయనం చేయించాలని విజ్ఞప్తి చేసింది. గోదావరి నది తీరరాష్ట్రాలు, సీడబ్ల్యూసీ, ఎన్‌ఐహెచ్‌ సీఈలతో సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ప్రాజెక్టు వివరాల అంశంలో పూర్తి పారదర్శకత అవసరమని.. అందరికీ ఆమోదయోగ్యమైన సాంకేతిక పరిష్కారాన్ని రూపొందించాలని తెలంగాణ అభిప్రాయపడింది.

ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఆలస్యమైతే తీరని నష్టం: కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులు కొత్త ప్రాజెక్టు కిందకు రావని గతంలోనే చెప్పామని.. అనుమతుల్లేని ప్రాజెక్టు జాబితా నుంచి ఈ కాంపోనెంట్ తొలగించాలని మరో లేఖలో పేర్కొన్నారు. పనులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న సీడబ్ల్యూసీ.. అభిప్రాయాల కోసం గోదావరి బోర్డుకు రాస్తే ఇక్కడ అనవసర ఆలస్యం చేయడం తగదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

పనుల విషయంలో యధాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తప్ప.. అనుమతుల విషయంలో కాదని లేఖలో ప్రస్తావించారు. అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన ప్రక్రియను.. గోదావరి బోర్డు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఆలస్యమైతే తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ ప్రాజెక్టులు ఆపేయాలి : కర్ణాటక నిర్మిస్తున్న అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో.. కృష్ణా జలవివాదాల మొదటి ట్రైబ్యునల్ తీర్పులోని అంతర్‌రాష్ట్ర అంశాలను పట్టించుకోలేదని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. రెండో ట్రైబ్యునల్ తీర్పు వచ్చాకే ఈ ప్రాజెక్టులకు అనుమతుల అంశాన్ని కేంద్ర జలసంఘం పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ రెండు ప్రాజెక్టులకు అనుమతులిచ్చేటప్పుడు.. అంతర్ రాష్ట్ర అనుమతులు, ట్రైబ్యునల్ నివేదికలను ప్రభుత్వం పరిశీలించాలంది. అప్పర్ తుంగ, అప్పర్ భద్ర అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలని కేంద్రాన్ని కోరింది.

ఇవీ చూడండి:ఘనంగా బతుకమ్మ వేడుకల నిర్వహణపై సర్కార్​ దృష్టి.. ప్రత్యేకించి హైదరాబాద్​లో..!

భారీ వర్షాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన రెండు ఆవులు

ABOUT THE AUTHOR

...view details